ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్నేహ సంబంధాలను కొనసాగించడం వైపే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఆసక్తి చూపుతోంది. వైఎస్ జగన్ పై ఘర్షణ వైఖరి కంటే ఆయనతో స్నేహంగా ఉండటమే మంచిదని భావిస్తోంది. అందుకే- వైఎస్ జగన్ కు కీలక పదవిని ఆఫర్ చేసింది. అంతర్ రాష్ట్రాల మండలి స్థాయీ సంఘం సభ్యునిగా నియమించింది.

 

బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో నలుగురికి కేంద్రం ఈ స్థాయీ సంఘంలో సభ్యత్వాన్ని కల్పించింది. వారిలో ఇద్దరు తటస్థులు కావడం, ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీకి చెందిన నాయకుడు కావడం, మరొకరు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం గమనార్హం.

 

అమిత్ షా ఛైర్మన్ గా..

 

రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల గురించి దర్యాప్తు చేయడం, వాటిని పరిష్కరించడానికి అవసరమైన సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వానికి అందించడం ఈ స్థాయీ సంఘం ప్రధాన విధి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.. ఇందులో కీలక మార్పులను చేశారు. అంతకుముందు- ఈ స్థాయీ సంఘానికి ప్రధాని ఛైర్మన్ గా వ్యవహరించారు. ఈసారి హోం శాఖ మంత్రిని ఛైర్మన్ గా నియమించారు.

 

అనంతరం స్థాయీ సంఘంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వైఎస్ జగన్ ఒక్కరినే ఈ కమిటీలో చోటు కల్పించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది. వైఎస్ జగన్ కంటే పరిపాలనలో అనుభవం ఉన్న మరో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేరును పరిశీలనలోకి తీసుకోలేదు.

 

ఏ పదవిని భర్తీ చేయాలన్నా రాజకీయ కోణంలో చూసే అలవాటు బీజేపీకి ఉందని, అలాంటి పార్టీ ఇద్దరు తటస్థ ముఖ్యమంత్రులకు కీలక పదవుల్లో నియమించడం వెనుక రాజకీయ కారణాలు లేవనే విషయాన్ని కొట్టి పారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 

తటస్థులపై దృష్టి..

 

అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ కూటములకు దూరంగా, తటస్థంగా ఉంటూ వస్తోన్న ఇద్దరు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ లకు చోటు దక్కింది. దీనితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు చోటు కల్పించడం వల్ల విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశం కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

యూపీఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఇందులో కొత్తగా చోటు ఇచ్చారు. ఈ నలుగురు కాకుండా.. మరో నలుగురు ముఖ్యమంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన వారే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), అమరీందర్ సింగ్ (పంజాబ్)లను కొత్తగా ఇందులో చోటు కల్పించారు. వారితో పాటు శర్బానంద సోనోవాల్ (అసోం), విజయ్ రూపాణీ (గుజరాత్) దేవేంద్ర ఫడణవీస్ (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ (ఆర్థికం), నరేంద్ర సింగ్ తోమర్, (వ్యవసాయం), తావర్ చంద్ గెహ్లాట్(సామజిక న్యాయం), గజేంద్రసింగ్ షెకావత్ (జలశక్తి) సభ్యులుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: