దేశ రాజ‌ధాని ఢిల్లీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీసుకు ఆయనను తరలించారు. ఆయ‌న్ను ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం రామ్‌మ‌నోహ‌న్ లోహియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిదంబరాన్ని కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ రాత్రికి చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లగా ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. మంగ‌ళ‌వారం రెండుసార్లు చిదంబరం ఇంటికి వెళ్లారు. రాత్రి చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 


అయితే, ఆయన ద‌ర్యాప్తు సంస్థ‌ల ముందుకు రాలేదు. మ‌రోవైపు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సీబీఐ, ఈడీ అధికారులు ఎదురుచూశారు. అయితే చిదంబరం అజ్ఞాతంలోనే ఉండిపోయారు. 24 గంటల అజ్ఞాతం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. అరెస్టుకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. 
సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లు మూసివేశారు. దీంతో సీబీఐ సిబ్బంది గోడదూకి లోపలికి ప్రవేశించి ఢిల్లీ పోలీసుల సహాకారంతో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: