వైఎస్ జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని  పదేళ్ల తరువాత చేరుకున్నారు. ఇందుకోసం ఆయన పోరాటం చేసిన తీరు అందరికీ స్పూర్తిగా నిలిచింది. ఏ విషయంలోనైనా సాధించిన వారిని విజేత అంటాం. తెలివైన వారు అని కూడా అంటాం. మరి వైఎస్ జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మరి జగన్ రాజకీయంగా పదేళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాటుదేలారనుకోవాలి.


కానీ జగన్ కి ఏమీ తెలియదని, అందరినీ నమ్మేస్తారని ఇపుడు వినిపిస్తున్న మాటలు, అవే విమర్శలు కూడా. చంద్రబాబు తరచూ జగన్ని అనే ఒకే ఒక మాట అనుభవం లేదని. ఇపుడు అదే మాటను మరోలా ఇతర పార్టీ నేతలు కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ కేసీయార్ తో దోస్తీ చేయడం పట్ల ఏపీలోని రాజకీయ పార్టీలు పూర్తిగా నెగిటివ్ గానే స్పందిస్తున్నాయి. నిజానికి కేసీయర్ తో జగన్ దోస్తీకి పెద్ద చరిత్ర కూడా లేదు.  అది ఈ మధ్యనే మొద‌లైంది. 


జగన్ ఓదార్పు యాత్రను  అన్ని విధాలుగా అడ్డుకుని  మానకొండ గాయాన్ని రేపిందే కేసీయార్. ఇక కేసీయార్ రాజకీయ దురంధరుడు. జగన్ తో పోలిస్తే  ఢక్కామొక్కీలు తిన్న వాడు. అందువల్లనే జగన్ ఆయనతో స్నేహం చేస్తే ఏపీకి ఏదో విధంగా అన్యాయం జరుగుతుందన్న అన్న  బాధ సగటు ప్రజనీకంలోనూ ఉంది. కేసీయార్ మొదట చంద్రబాబుని,   తరువాత సోనియా గాంధీని,   చివరికి నరేంద్ర మోడీని కూడా  తన రాజకీయంతో చిత్తు చేసిన వాడు. అంటే వారంతా జగన్ కంటే రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి కూడా కేసీయార్ ఎత్తులను, జిత్తులను వూహించలేకపోయారు. ఇపుడు జగన్ విషయమైతే కేసీయార్ కి మరీ సులువు అంటున్నారు.


నీరు, నిధులు అన్న అంశం మీదనే తెలంగాణా ఉద్యమం మొత్తం నడిచింది. అటువంటి కేసీయార్ తో నీటి ఒప్పందలౌ అంటే జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలని టీజీ వెంకటేష్ లాంటి సీనియర్లు కూడా సూచిస్తున్నారు. కేసీయార్ ని ఎంత తక్కువ నమ్మితే అంత ఎక్కువగా జగన్ జీవితం బాగుంటుందని టీజీ లాంటి వారు అంటున్నారంటేనే అర్ధం చేసుకోవాలి. మరి జగన్ ఈ విషయంలో అందరి మాటలు వింటారా,  లేక తాను అనుకుంటున్నట్లుగానే కేసీయార్ దోస్తీలో పడి ముందుకు సాగుతారా అన్నది పెద్ద చర్చగా వుంది. జగన్ కేసీయార్ విషయంలో అమాయకుడో, అసాధ్యుడో మాత్రం కాలమే నిర్ణయించాలని అంటున్న వారూ ఉన్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: