బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ తాజాగా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంది. ఒకవైపు రాజధాని అమరావతిని మారిస్తే ఊరుకునేది లేదని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ ను హెచ్చరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో జగన్ విధానాలను, నిర్ణయాలకు మద్దతిస్తున్నట్లుగా టిజి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో  పార్టీలో కూడా రాజధాని విషయమై అయోమయం మొదలైంది.

 

రాజధాని అమరావతి ప్లేస్ లో నాలుగు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తాను స్వాగతిస్తున్నట్లు టిజి బహిరంగంగా చెప్పారు. నిజానికి నాలుగు రాజధానులన్న మాటను జగన్ ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో చంద్రబాబునాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని విషయాన్ని కూడా పక్కనపడేశారు.  అందుకే రాష్ట్రంలో నాలుగు అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లుగా ఆ బిజెపి ఎంపి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

 

విజయనగరం, కాకినాడ గుంటూరు, కడప కేంద్రంగా అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయబోతున్నట్లు టిజి చెప్పారు. కాబట్టి నాలుగు అభివృద్ధి మండళ్ళ కేంద్రాలనే నాలుగు రాజధానులుగా చేయబోతున్నట్లు జగన్ కేంద్రానికి ఇప్పటికే చెప్పినట్లు టిజి  చేసిన వ్యాఖ్యలతో  కలకలం మొదలైంది. నాలుగు కేంద్రాల్లోను నాలుగు అసెంబ్లీలను కట్టేస్తారట జగన్. జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని కూడా టిజినే డిసైడ్ చేసేశారు.

 

అంటే టిజి వ్యాఖ్యలు బిజెపి అధ్యక్షుడి వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పైగా రాజధాని నిర్మాణం చేయటం అమరావతి ప్రాంతంలోని స్ధానికులకే ఇష్టం లేదని కూడా ఎంపి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ను ఓడించటమే తన వ్యాఖ్యలకు సాక్ష్యంగా చెప్పుకున్నారు. రైతులు కూడా అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పటంతో పార్టీతో పాటు అమరావతి ప్రాంత రైతుల్లో కూడా అయోమయం మొదలైంది. మొత్తానికి రాజధాని నిర్మాణంలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: