రికార్డ్ స్థాయిలో కరెంట్ ఉత్పత్తి అయింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరదలు రావడంతో పదేళ్ల తర్వాత కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో లక్ష్యానికి మించి పవర్ జనరేట్ అయింది. కర్నూలు జిల్లా శ్రీశైలం నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవకపోయినా మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలానికి భారీ వరదలు వచ్చాయి. అదే విధంగా తుంగభద్ర డ్యాం నుంచి వరద ఊహించని విధంగా వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత సమృద్ధిగా ఉండటంతో జెన్ కో అధికారులు భారీగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.



వరదలు వచ్చిన సమయంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత నెల ముప్పై ఒకటి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రారంభమైంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణ జెన్ కో అధికారులు పవర్ జనరేషన్ ను ప్రారంభించారు. ఇక ఆంధ్రా పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఈ నెల ఏడో తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఏపీ జెన్ కో అధికారులు ప్రారంభించారు. ఆగస్టు నెల మొత్తానికి అంటే ఒక నెలకు నూట తొంభై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఏపీ జెన్ కో అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు.



విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ కేంద్రాల్లో రోజుకు ఏడు యూనిట్ లు రన్ చేసి ఒక్కో యూనిట్ కు నూట పది మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం చొప్పున ఏడు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగా, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ఆరు యూనిట్ లు రన్ చేసి ఒక్కో యూనిట్ ద్వారా నూట యాభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం చొప్పున రోజుకు తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ను నాన్ స్టాప్ గా ఉత్పత్తి చేశారు.



కుడి విద్యుత్ కేంద్రాల్లో ఈ నెల ఏడో తేదీ నుంచి ఇరవై ఒకటివ తేదీ వరకు అంటే కేవలం రెండు వారాల్లో రెండు వందల డెబ్బై పాయింట్ ఏడు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. ఆగస్టు నెలలో టార్గెట్ కంటే 78.75 మిలియన్ యూనిట్ లు అధికంగా విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇక తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రంల్లో కుడి విద్యుత్ కేంద్రాల్లో కంటే ఎక్కువగా పవర్ జనరేషన్ జరిగింది. రెండు వేల తొమ్మిదిలో ఎగువ రాష్ర్టాల నుంచి శ్రీశైలానికి సుమారు ఇరవై ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుకుంది. ఆ వరదల్లో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు నీట మునిగాయి. దీంతో కొద్ది రోజులు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది.



ఆ తర్వాత కరెంటు ఉత్పత్తి పునహ్ ప్రారంభమైంది. రెండు వేల తొమ్మిది వ సంవత్సరంలో డ్యాం నీరు సమృద్ధిగా ఉండటంతో రికార్డు స్థాయిలో పవర్ జనరేషన్ జరిగింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ఏడాది శ్రీశైలానికి దాదాపు పదకొండు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకోవడంతో దాన్ని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకున్నారు. వరదలను దృష్టిలో పెట్టుకొని పవర్ జనరేషన్ కేంద్రాలకు ఎటువంటి నష్టం జరగకుండా జిల్లా జల వనరుల శాఖ అధికారులు వచ్చిన నీటిని పథకం ప్రకారం కింద నాగార్జున సాగర్ కు ఎగువన ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలించారు.



జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వ తేదీ నాటికి సుమారు ఎనిమిది వందల నలభై ఏడు టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. గేట్ల ద్వారా 546.5 టీఎంసీలు దిగువన సాగర్ కు పోతిరెడ్డిపాడు నుంచి సీమ జిల్లాలకు నలభై రెండు టీఎంసీల నీటిని తరలించారు. కేవలం కుడి విద్యుత్ కేంద్రం నుంచి నలభై టీఎంసీల నీరు వినియోగించి 270.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. ఇక ఎడమ విద్యుత్ కేంద్రంలో సుమారు యాభై టీఎంసీల నీరు వినియోగించి దాదాపు మూడు వందల మిలియన్ యూనిట్ లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా స్వల్పంగా వరద వస్తుండటం ప్రాజెక్టులో నీరు గరిష్ఠ మట్టంలో ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉన్నారు. భారీగా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తితో తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కొరత గండం నుంచి గట్టెక్కవచ్చని జెన్ కో అధికారులు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: