ఏపీ రాజధాని అమరావతి నగరంపై రచ్చ రోజుకో తీరుగా సాగుతోంది. అమరావతి ఏరియాకు ముంపు ప్రమాదం ఉందని వైసీపీకి చెందిన నాయకులు, మంత్రులు విస్పష్టంగా చెప్తున్నారు. రాజధాని నగరాన్ని అక్కడ నుంచి మార్చుతామని నేరుగా చెప్పకపోయినా అమరావతి ఇక చారిత్రక నగరంగానే మిగిలనుందనే విషయం అర్థమవుతోంది. కానీ ఇంత వరకు ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రకటన ఏదీ చేయలేదు. అయితే అటు బిజెపి ఇటు తెలుగు దేశం పార్టీలు మాత్రం అమరావతి నగరం పైన రాజధానికి భూములిచ్చిన రైతులపైన సానుభూతి చూపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ముప్పేట దాడి కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ, అమరావతి లోనే రాజధానిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.


గత వారం రోజులుగా రాజధాని పై రచ్చకు కేంద్ర బిందువుగా మారిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏమాత్రం తగ్గట్లేదు. అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. సమయం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాల్ని బయటపెడతామని ప్రకటించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది కనుకే దాని గురించి చెప్పానంటూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్న బిజెపి నేతలు పవన్ కల్యాణ్ గతంలో ఏం మాట్లాడారో గుర్తించుకోవాలన్నారు. అమరావతిలో తనకు సెంటు భూమి లేదని చెబుతున్న మాజీ కేంద్ర మంత్రి గట్టిగా సవాల్ చేస్తే ఆయన భూములు ఎక్కడున్నాయో చూపిస్తామన్నారు బొత్స.


ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో, ఎవరికోసమో ప్రభుత్వం ఉండదు, మేము 5 కోట్ల ప్రజలకి మరియు ప్రభుత్వానికి సమాధానం ఇస్తాం వేరే ఎవరికో ఇవ్వం అని ఆయన అన్నారు. రాజధానికి చెందిన పలువురు రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం సరికాదన్నారు చంద్రబాబు. అమరావతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ సీఎం. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని కానీ ఇప్పుడు దొనకొండలో ఇన్ సైడ్ ట్రేడింగ్ మొదలయ్యిందని కమెంట్ చేశారు.


ఇదిలా ఉంటే బిజెపి నేతలు రాజధాని ప్రాంతంలో ఈరోజు పర్యటించబోతున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న పలువురు రాజధాని రైతులు బీజేపీ అధ్యక్షుడు ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకుని తమ సమస్యను ఆయనకు చెప్పుకున్నారు. అమరావతిలో పర్యటించాల్సిందిగా బిజెపి నేతలను కోరారు. రైతుల కోరిక మేరకు కొద్ది కాలం క్రితమే బీజేపీ లో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇతర నేతలతో కలిసి కన్నా ఇవాళ రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: