ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలకు ధీటుగా ఓ చిన్న పట్టణంలో అతిపెద్ద స్క్రీన్ సినీ ప్రేక్షకులను అలరించబోతుంది. 30 వ తేదీ నుంచి అతి పెద్దదైన స్క్రీన్ కనువిందు చేయనుంది. ఆసియాలోనే పెద్దదైన బాహుబలి థియేటర్ ప్రేక్షకులను ఔరా అనిపించ నుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర ఓ వైపు ప్రతిష్టాత్మకమైన శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం, మరోవైపు ప్రత్యేక ఆర్ధిక మండలంలో శ్రీసిటీ మాంబట్టు సెజ్ లు. మధ్యలో ఆవిష్కృతమైందే  బాహుబలి థియేటర్.


చెన్నై, కోల్ కతా జాతీయ రహదారిని ఆనుకొని సూళ్లూరుపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో యూవీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ పేరుతో ఆరున్నర ఎకరాల్లో భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించింది. సినీ నటుడు ప్రభాస్ కూడా ఇందులో భాగస్వామి. విఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం మూడు థియేటర్ లు ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో నూట ఆరు అడుగుల భారీ స్ర్కీన్ ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ లేదని చెప్పవచ్చు. ఈ బాహుబలి ధియేటర్ లో ఆరు వందల డెబ్బై సీట్లున్నాయి.


నూట డెబ్బై సీట్ల చొప్పున మరో రెండు థియేటర్ లు ఉన్నాయి. బాహుబలి థియేటర్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ నెల ముప్పైన ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం విడుదలతో బిగ్ స్క్రీన్ ప్రారంభం కానుంది. బిగ్ స్క్రీన్ లో అత్యాధునిక సౌండ్ సిస్టం సహా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సుమారు నలభై కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. తమ ఊరికి బిగ్ స్క్రీన్ రావడం ఎంతో ఆనందం కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు. సూళ్లూరుపేట తడ పరిధిలో మాంబట్టు సెజ్, శ్రీసిటీ సెజ్ లతో పాటు అంతర్జాతీయంగా పేరుగాంచిన రాకెట్ కేంద్రం షార్ ప్రాంత వాసులకు అందుబాటులో బిగ్ స్క్రీన్ సిద్ధమైంది.


భాషా పరంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సినీ ప్రేక్షకులకు పెద్ద నగరాల్లోని మల్టీప్లెక్స్ లను తలదన్నేలా హీరో ప్రభాస్ అండ్ కో నిర్మించిన బాహుబలి థియేటర్ ఆకర్షిస్తోంది. పారిశ్రామికాభివృద్ధికి కేంద్రమైన శ్రీసిటీ దగ్గర బాహుబలి థియేటర్ రావడంపై వారేవా ఇంతటి భాగ్యమా అంటూ స్థానికులు సంబరపడిపోతున్నారు. ముప్పై న సాహో చిత్రం సినిమా రిలీజ్ తో ప్రారంభమవుతున్న బాహుబలి థియేటర్ లో బిగ్ స్క్రీన్ పై షో చూసేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: