మనిషి ఆశాజీవి అన్న విషయం చంద్రబాబునాయుడు విషయంలో తాజాగా మరోసారి నిరూపితమైంది.  మనిషిని నడిపిస్తున్నదే నిజానికి భవిష్యత్తుపై ఆశే. కానీ ఇది మామూలు జనాల విషయంలో సాధారణంగా జరిగేదే. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. రాజధాని నిర్మాణం చేసేందుకు వచ్చిన  బంగారం లాంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు. అలాంటిది మళ్ళీ అమరావతిని తానే నిర్మిస్తానని తాజాగా నేతలతో చెబుతున్నారంటే ఏమనర్ధం ?


 2014లో రాజధాని కూడా లేకుండానే సమైక్యాంధ్రను విడగొట్టారు. దాంతో ఏపికి కొత్తగా రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అనుభవజ్ఞుడనని, రాజధాని నిర్మించటం తన వల్లే సాధ్యమని, సింగపూర్ లాంటి రాజధాని అని ఏవేవో కథలు చెప్పారు చంద్రబాబు. సరే ఏదో అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రయ్యారు.

 

సిఎం కాగానే వెంటనే తాను అనుకున్న ప్రాంతంలోనే శాస్వతంగా సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు, రాజ్ భవన్ లాంటివి కట్టేసుంటే సరిపోయేది. అలా కాకుండా పిచ్చి చేష్టలు మొదలుపెట్టారు. సింగపూర్, లండన్, టర్కీ లాంటి పేర్లు చెప్పి జనాలను పిచ్చోళ్ళని చేశామని అనుకున్నారు. ఏదేశానికి వెళితే ఆ దేశం రాజధాని లాగ అమరావతిని నిర్మిస్తానంటూ త్రిడి సినిమాలు చూపించటం మొదలుపెట్టారు.

 

ఇంతా చేసి నిర్మించింది నాసిరకం తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే. ఇంతోటి దానికి తానేదో బ్రహ్మండమైన నిర్మాణాలు చేసేస్తుంటే మధ్యలో ఎన్నికల వచ్చి ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. వాటిని జగన్ అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

 

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, మనకు ఎటివంటి రాజధాని అవసరం అనే విషయాలను చంద్రబాబు గుర్తుంచుకుని ఉంటే ఓవర్ యాక్షన్ చేసుండే వారు కాదు. అప్పట్లోనే రాజధానికి ఏది అవసరమో ఆ నిర్మాణాలను శాస్వతంగా చేసేసుంటే ఇపుడు రాజధాని నిర్మాణంపై ఇంత కంపు జరిగుండేదే కాదు. తప్పులన్నీ తనలో పెట్టుకుని తన చేతకాని తనాన్ని జగన్ మీదకు తోసేస్తున్నారు. పైగా అమరావతిని నిర్మించే అవకాశం మళ్ళీ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే ఆ అవకాశం చంద్రబాబుకు జగన్ ఇచ్చేట్లు కనబడటం లేదే.

 



మరింత సమాచారం తెలుసుకోండి: