ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనే అతి ముఖ్యమయిన అంకాన్ని అడ్డుకునేందుకు, సీమాంధ్ర ప్రజల సమైక్య ఆకాంక్షను నిలబెట్టేందుకు ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడిగా 65 రోజుల సమ్మెకు నాయకత్వం వహించి తెలంగాణను అడ్డుకుంటాడు అని అశోక్ బాబును నమ్ముకుంటే ఆయన వ్యవహారం అంతా తిరకాసుగా కనిపిస్తోంది. అశోక్ బాబు చేతిలో సమైక్యాంధ్ర ఉద్యమం కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే నేరుగా సమ్మెకు దిగిపోవడం అశోక్ బాబు అవగాహనాలోపానికి నిదర్శనం అన్న విమర్శలు వస్తున్నాయి. మీడియా కూడా అశోక్ బాబుకు అతి ప్రాధాన్యత ఇచ్చి మోయడంతో ఆయన తన వెనుకే సీమాంధ్ర ప్రజలు ఉన్నారన్న బిల్డప్ ఇచ్చి సమ్మె కాలాన్ని రాజకీయ నాయకులను హెచ్చరించడానికి వాడుకున్నాడు తప్పితే విభజనను అడ్డుకునేందుకు స్పష్టమయిన నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని అనిపిస్తోంది. ఓ వైపు ఢిల్లీలో విభజనకు సంబంధించి ముఖ్యమయిన నిర్ణయాలు జరుగుతుంటే ఇక్కడ సీమాంధ్రలో సమైక్య సభలలో హెచ్చరికలకు పరిమితం అయ్యారని, తీరా 65 రోజులు గడిచాక సమ్మె విరమణ ప్రకటించి ఇప్పుడు రాజకీయాలలోకి వస్తానని, ప్రజలు తనను రావాలని కోరుకుంటున్నారని, రాష్ట్ర విభజనను ఆపితే గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి నరేంద్రమోడీకి రూ.2500 కోట్లు ఇస్తానని పొంతనలేని, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  రాజకీయ పార్టీలను ఒక్క తాటి పైకి తీసుకువచ్చి సమైక్య నినాదం వినిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, కీలకమయిన బ్రహ్మాస్త్రం లాంటి సమ్మెను మొదట్లోనే వాడేయడం అశోక్ బాబు అనుభవలేమికి నిదర్శనంగా కనిపిస్తోంది. సమ్మె మూలంగా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం తప్పితే సాధించింది ఏమీ లేదన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: