కాంగ్రెస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌కు ట్ర‌బుల్స్ మొద‌ల‌య్యాయి. కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ప‌వ‌ర్ గేమ్‌లో గ‌త‌ ఏడాది బీజేపీ  అధిష్టానం అనేక వ్యూహాలు ప‌న్నిన‌ప్ప‌టికీ...అన్నింటికీ మించి జేడీఎస్‌-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేజార‌కుండా చేసి ఆ పార్టీ కూట‌మే గ‌ద్దెనెక్కేందుకు కార‌ణ‌మైంది కన్నడ ప్రజలకు డీకేఎస్‌గా సుపరిచితుడైన మాజీ మంత్రి డీకే శివకుమార్. క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌కు తరలించడం, మళ్లీ కర్ణాటకకు సురక్షితంగా తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఆయ‌న మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. 


శివకుమార్‌ పన్ను ఎగవేతకు పాల్పడ్డారని, హవాలా లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ గతేడాది ఐటీ అధికారులు బెంగళూరులోని కోర్టులో చార్జిషీట్‌ వేశారు. త‌న‌పై జ‌రుగుతున్న ద‌ర్యాప్తు గురించి శివకుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ 2017లో గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఉండేందుకు కర్ణాటకకు తీసుకొచ్చానని, దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రం కక్షసాధింపునకు దిగిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు వ్యతిరేకంగా ఐటీ దాడులు, ఈడీ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 


కాగా, ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల్లో డీకే శివ‌కుమార్ కీల‌క పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీకి రెబెల్స్‌ తాకిడి ఎక్కువైంది. గాంధీభవన్‌ ముందు ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఆయా నియోజకవర్గాల్లోనూ తీవ్రమైన అసమ్మతి చెలరేగింది. దాదాపు 40 మంది అసమ్మతి నేతలు నామినేషన్లు వేశారు. అయితే, వీరందరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ త్రిసభ కమిటిని రంగంలోకి దించింది. అసమ్మతి నేతలతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఇందులో పుదుచ్చేరి ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, మంత్రి మల్లాది కృష్ణారావు, కర్నాటక మంత్రి డికె శివకుమార్‌ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: