నెల్లూరు ఎంజీఆర్ ఎవరు, ఆ జిల్లాలో ఒకప్పుడు ఎంజీఆర్ ని ఏ నేత ఫాలో అయ్యారు. తమిళనాడు పాతకాలం రాజకీయాల గురించి ఆ జిల్లాలో ఇప్పుడెందుకు చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ స్పీడు పెంచిన మంత్రి ఎవరు మాజీ ఎంపీ మేకపాటికి మళ్లీ రాజకీయంగా అవకాశం దక్కుతుందా. ఆయన దత్తత గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు. "కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా" అన్న సామెతను స్మరింపచేస్తోంది సింహపురిలో మేకపాటి కుటుంబంపై జరుగుతున్న చర్చ. రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో ఏపీ తెలంగాణ రాజకీయాలే కాకుండా పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాల గురించి కూడా చర్చిస్తుంటారు. అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు జరగడం లేదు.


అలాగని అక్కడ సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు. ఐనప్పటికీ తమిళనాట అందరికీ సుపరిచితమైన ఎంజీఆర్ గురించి నెల్లూరీయులు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ అంశంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇంతకీ నెల్లూరు జిల్లా నేతల్లో ఎవరిని ఎంజీఆర్ తో పోల్చారు అనేగా మీ సందేహం, అక్కడికే వస్తున్నా ఇది తెలుసుకునే ముందు తమిళుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎంజీఆర్ ని ఒకసారి స్మరించుకుందాం. కేరళలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎంజీఆర్ చిత్ర సీమలో తనకంటూ తరగని కీర్తిని గడించారు. నటుడిగా ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవారు. దానధర్మాలు చేసేవారు, పేదలు కష్టసుఖాలు పంచుకునేవారు. అలా ఆయన రాజకీయాల్లోకి రాక మునుపే మాస్ లీడర్ అయ్యారు.


అలా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పదేళ్లు సీఎం పదవిలో ఉన్నారు. అందువల్ల ఎంజీఆర్ అంటే నెల్లూరుయిలకి అమితమైన అభిమానం. దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సినీ హీరోలను ఎక్కువగా ఫాలో అయ్యేవారు. ప్రతి రోజు రాత్రి సెకండ్ షో సినిమా చూసే అలవాటు ఆయనకుండేది. అప్పుడప్పుడు సినిమా హీరోల మాదిరిగా ఫ్యాషన్ దుస్తులు ధరించి జనంలోకి వెళ్ళేవారు అడపదడపా ఎంజీఆర్ ల టోపి పెట్టుకొని ఆయనను అనుకరిస్తూ వుండేవారు. అప్పట్లో ఆనం వివేకాని నెల్లూరు ఎంజీఆర్ అని కొందరు పిలుస్తుండేవారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ప్రాతి నిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతంరెడ్డి విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయనను కూడా షార్ట్ కట్ లో ఎంజీఆర్ అని కొందరు పిలుస్తున్నారు.



ఇది విని మరికొందరు మేకపాటి గౌతంరెడ్డిని ఎంజీఆర్ అని పిలిచినంత మాత్రాన ఆయన గొప్పవారు ఎలా అవుతారు అంటూ లాజిక్కు లాగుతున్నారు. మేకపాటి గౌతంరెడ్డి సంపదలో పుట్టి అందులోనే పెరిగారని ఆయనకు పేదల కష్టాలు పెద్దగా తెలియవు అని కొందరు వాదిస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజక వర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి గౌతంరెడ్డి ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన స్పీడ్ బాగా పెంచారు. అంతకుముందు పెద్దగా రాజకీయాల గురించి పట్టించుకోని మేకపాటి గౌతంరెడ్డి ఇప్పుడు జిల్లా మొత్తం తెగ తిరిగేస్తున్నారు. దీంతో ఈ మధ్యనే ఆయన పేరు షార్ట్ గా ఎంజీఆర్ అయింది.



ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతుండడమే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పేదల మనిషని, ఆయన సంపాదనంతా ప్రజల కోసమే ఖర్చు చేశారని, మరి మేకపాటి వారు అలాగ చేయగలరా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంజీఆర్ అంతటి పేరు తెచ్చుకోవటం సులభమేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కొన్ని ఘటనలను కూడా వారు ఉదహరిస్తున్నారు. మర్రిపాడు మండలం, కంపసముద్రం గ్రామాన్ని గౌతమ్ తండ్రి రాజమోహనరెడ్డి దత్తత తీసుకున్నారు. కానీ ఆయన ఊరికి చేసిందేమీ లేదట. గ్రామంలో కనీస వసతులు కూడా కల్పించలేదన్న విమర్శలు ఉన్నాయి. చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక వ్యవసాయ పనులే చేసుకుంటున్నారు. వారి నియోజక వర్గంలో వారి ఊరి పక్కనే ఉన్న దత్తత గ్రామానికే ఏమీ చేయని మేకపాటి వారు ఇప్పుడు ఎంజీఆర్ పేరు పెట్టుకోగానే గొప్ప పని చేస్తారా ఏంటి అని ఇంకొందరు సెటైర్ లు పేలుస్తున్నారు.



ఇదిలా వుంటే మేకపాటి రాజమోహనరెడ్డి రాజకీయ భవిష్యత్ పైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఉదయగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్నుంచి ఆయన రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు, ఏడు సార్లు ఎంపీ గా పోటీ చేశారు. ఐదుసార్లు ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు నుంచి విజయం సాధించారు. జగన్ చెప్పిన వెంటనే ఆయన రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికలలో మేకపాటికి టికెట్ దక్కక పోవడం పలు రకాల చర్చలకు దారి తీసింది.



ప్రస్తుతం రాజమోహన్ రెడ్డిని రాజ్యసభకు పంపుతామని ఒకసారి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని మరోసారి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. రాజ్యసభకు పంపే అవకాశం కూడా రాజమోహన్ రెడ్డికి ఇప్పట్లో లేదు. మరి మంత్రి పదవి మేకపాటి గౌతంరెడ్డికి ఇచ్చేశారు. రాజమోహన్ రెడ్డికి ఇంకేమి ఇస్తారు. ఆయనకు రాజకీయంగా మళ్లీ అవకాశం దక్కుతుందా అని నెల్లూరీయులు కూడా చర్చించుకుంటున్నారు. ఇదండీ సీమపురిలో ఎంజీఆర్ పైన మేకపాటి వారి పైన సాగుతున్న చర్చల సారాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: