హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ భేటీల పర్వానికి శ్రీకారం చుట్టారు. శనివారం నాడు తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు ఇంట్లో భేటీ అయ్యారు. రాజకీయాలపై సమీక్షించారు.  తాజాగా రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలంగాణలో అధికార కాంగ్రెస్ అల్లాడిపోయింది. తెలంగాణలో జగన్ ప్రభావం ఏమీ లేదనీ కాకి లెక్కలు చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నేతల దిమ్మ తిరిగి పోయే విధంగా పరకాల ఓటర్లు తీర్పు ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకుండా ‘పాడిందే పాడురా పాసిపళ్ల దాసు’ అన్నట్లుగా వారి వ్యవహారం వుంది. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చాక కూడా కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పురాలేదు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే తాజా రాజకీయాలు, పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఐదో స్థానంకు వెళ్లిన విషయమై సమీక్షించినట్లు సమాచారం. ఎవరూ ఊహించని విధంగా ప్రజలు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేశారు. పరకాలలో వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజలు విశేషమైన ఆదరణ చూపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో జగన్ ప్రభావం ఏమీ ఉండదంటూ ఇప్పటి దాకా అధిష్టానానికి చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణ ఎంపీలు,నాయకులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరస్థితి. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు కావడం, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచినంత పని చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అంతర్మథనంలో పడ్డారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ తమ స్వరాన్ని పెంచేందుకు సిద్ధపడుతున్నారు.  తెలంగాణపై ఇప్పటికైనా తేల్చకుంటే సీమాంధ్రతో పాటు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందనీ అధిష్టానంకు విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ నేతలు. సంవత్సరాల తరబడిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్లు తెలంగాణను తేల్చాలని కోరుతున్నారు. కానీ, ఏనాడు వీరి గోడును అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు లేవు. గడిచిన రెండేళ్లలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొన్ని వందలమార్లు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు వారు సాధించిందేమీ లేదు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత భేటీ అయిన వీళ్లు తెలంగాణ అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే, ఇప్పటికే పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి వచ్చిన 50వేల ఓట్ల నేపథ్యంలో తెలంగాణలో సెంటిమెంటు వుందా?అనే దానిపై కేంద్రమంత్రి వయలార్ రవి వంటి వాళ్లు ఆరాదీసే పనిలో ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను కోలుకోలేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా చర్చనీయాశంగా మారింది. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: