రాష్ట్రంలో చాలామందికి చంద్రదశే నడుస్తోందంటున్నారు బిజెపి నేతలు. అందుకనే చాలామంది చంద్రబాబునాయుడు మాయాజాలంలో పడిపోయి ఆయన భావజాలాన్నే పట్టుకుని ఊగుతున్నట్లు మండిపోయారు. బిజెపి ఎంఎల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే రాజధాని అమరావతి మాయలో పడి కొట్టుకుపోతున్నట్లు చెప్పారు. అమెరికాతో కలిపి అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని చూసినా వాటి రాజధానులు మహా నగరాల్లో లేవన్నారు.

 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి రూరల్ ఏరియాలోనే ఉందన్నారు. అందరికీ తెలిసిన వైట్ హైస్ ప్రాంతం కేవలం అధ్యక్షుడి భవనం మాత్రమేనట. అలాగే ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘర్ ఇలా ఏ రాష్ట్రం తీసుకున్నా రాజధాని గురించి అసలు చర్చే ఉండదన్నారు. కానీ ఏపిలో మాత్రమే రాజధాని గురించి రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా ఎందుకింతగా గొంతుచించుకుంటున్నాయో అర్ధం కావటం లేదట వీర్రాజుకు.

 

రాష్ట్రంలోని మేజర్ సెక్షన్ చంద్రబాబు మాయలో పడి కొట్టుకుపోతున్నట్లు అంగీకరించారు. అయితే సామాన్య జనాలు మాత్రం చంద్రబాబు మాయలో లేరని కూడా చెప్పారు లేండి. ఎందుకంటే 2004లో కానీ 2019లో కానీ జనాలు చంద్రబాబును ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోపెట్టినట్లు స్పష్టం చేశారు.

 

ముఖ్యమంత్రి కూర్చుని పనిచేసే ప్రాంతం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని అనుకుంటే అసలు సమస్యే ఉండదన్నట్లుగా మాట్లాడారు. అధికార వికేంద్రీకరణ చాలా మంచిదన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబునాయుడు ఆలోచించాలన్నారు.

 

కొత్తగా కెసియార్ నిర్మించాలని అనుకుంటున్న అసెంబ్లీ, సచివాలయం వ్యయం మొత్తం కలిపి రూ. 250 కోట్లలో పూర్తియపోతుంటే ఏపికి మాత్రం వేల కోట్లు ఎందుకు అవసరమని చంద్రబాబు చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదని మండిపడ్డారు. కాబట్టి దయచేసి అందరూ చంద్రదశలో నుండి బయటపడాలని చెబుతూనే ఇక నుండి రాజధాని నిర్మాణం గురించి చర్చలు అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: