తెలుగుదేశం పార్టీకి ఏమైంది. అంటే ఏదో అయిందనే చెప్పాలి. కంచుకోట మంచుకోటగా మారి కుప్పకూలిపోతోంది. అది కూడా చాలా తొందరగానే. సీనియర్ నేతగా ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించిన  చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్వయంగా తమ్ముడే షాక్ ఇచ్చేశారు. పసుపు శిబిరంలో ఇపుడు అది పెద్ద దుమారంగా మారింది. నిన్న కాక మొన్ననే బిగ్ షాక్. ఇపుడు మరో షాక్. అసలు సైకిల్ పార్టీకి ఏం జరిగింది.


ఈ రోజు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టిన రోజు. ఆయనకు  అందరూ  కానుకలు ఇస్తారు. కానీ సొంత తమ్ముడు ఎవరూ ఇవ్వని కానుక ఇచ్చాడు, బర్త్ డే గిఫ్ట్ అంటూ సన్యాసిపాత్రుడు ఏకంగా టీడీపీకి గుడ్ బై కొట్టేశారు. తన బలం ఏంటో చూపించేశాడు. నర్శీపట్నం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా సన్యాసిపాత్రుడు సతీమణి అనిత ఉండేవారు. వైఎస్ చైర్మన్ గా సన్యాసిపాత్రుడు ఉండేవారు. ఈ ఇద్దరితో పాటుగా పలువురు కౌన్సిలర్లు కూడా ఈ రోజు పార్టీకి రాజీనామా చేసేశారు.


ఇప్పటికే  విశాఖ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో  చేరిన విషయం విదితమే.  విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి  డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్‌ తింటున్నారు. అది కూడా విశాఖ జిల్లాలో నారా లోకష్‌ పర్యటన వేళ టీడీపీకి షాక్‌ తగిలినట్లు అయింది.


ఇదిలా ఉండగా ఎన్నికల ముందు నుంచే టీడీపీలో ఉండలేక అసమ్మతి రాజేసిన సన్యాసినాయుడు ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన తొందరలోనే వైసీపీలో చేరుతారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. ఇక మరింతమంది టీడీపీ నాయకులు కూడా వైసీపీ వైపు చూస్తున్నారని టాక్. మొత్తానికి చూసుకుంటే విశాఖ జిల్లాల్లో టీడీపీ పని అయిపోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: