గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం రాష్ట్రపతి పాలన రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్ ను ఆత్మీయ సన్మానం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్ గా చేస్తున్న రికార్డు సృష్టించిన నరసింహన్ కు సాయంత్రం వీడుకోలు పలుకుతుంది టిఆర్ఎస్  సర్కార్. మరోవైపు కొత్త గవర్నర్ గా తమిళ సాయి రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈ ఎస్ ఎల్ నరసింహన్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్ లో ఉన్నప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏరికోరి నరసింహన్ ను పంపింది.



అప్పట్నుంచీ ఇప్పటి దాకా సుధీర్ఘకాలం కేంద్రంలో ప్రభుత్వాలు మారినా గవర్నర్ గా కొనసాగారు. కేంద్ర నిఘా సంస్థలో పని చేసిన అనుభవం ఉన్న నరసింహన్ ఉద్యమ సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్డీ తివారీ వారసుడిగా ఏపీకి వచ్చిన గవర్నర్ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేశారు. దేశ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన తెలుగు రాష్ట్రాల విభజన నరసింహన్ హయాంలోనే జరిగింది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన రెండు వేల పద్నాలుగు జూన్ దాకా ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా కొనసాగారు నరసింహన్. విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఐదున్నరేళ్ల పాటు ఉన్నారు.



జూలై ఇరవై నాలుగున విశ్వభూషణ్ హరిచందనను ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ ను నియమించడంతో ప్రస్తుత తెలంగాణ గవర్నర్ గా కొనసాగారు. విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. దీంతో తొమ్మిదేళ్ల తొమ్మిది నెలలు గవర్నర్ గా చెయ్యటమేకాక రాష్ట్రపతి పాలన కూడా చేసి రికార్డుల్లోకెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఇప్పటి దాకా ఇరవై ఒక్క మంది గవర్నర్ లుగా పని చేశారు. అత్యధికంగా ఏడేళ్లు కృష్ణకాంత్ పనిచేయగా ఆ రికార్డుతో పాటు వరుసగా మూడు నెలలు తక్కువ పదేళ్లు పూర్తి చేసుకున్న రికార్డులను సొంతం చేసుకున్నారు నరసింహన్.


ఇలా తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న తమిళనాడుకు చెందిన ఈఎస్ఎల్ నరసింహన్ ముక్కు సూటిగా వ్యవహరించే గవర్నర్ గా అధికారులకు చివాట్లు పెట్టే విషయం లోనూ వెనక్కి తగ్గలేదు. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే గవర్నర్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవడం కార్పొరేట్ ఆస్పత్రులపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టే విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. కాళేశ్వరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేసీఆర్ ను కాళేశ్వరరావుగా పిలిచిన నిబంధనలకు విరుద్ధంగా ఉందని మునిసిపల్ బిల్లును వెనక్కి పంపించిన అన్నీ ఆయనకే చెల్లాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: