క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎంత తొందరగా టిడిపికి రాజీనామా చేసి బిజెపిలోకి వెళిపోదామా అని ఫిరాయింపు మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి తొందర పడుతున్నారు. అయితే ఆయన తొందరకు ఎప్పటికప్పుడు స్పీడు బ్రేకర్లు పడుతున్నట్లు సమాచారం. కమలం కడువా కప్పుకునేందుకు రెండుసార్లు ముహూర్తాలు పెట్టుకుని కూడా జాయిన్ అవటంలో ఫెయిల అయ్యారు.

 

ముహూర్తం పెట్టుకుని కూడా ఎందుకు జాయిన్ కాలేకపోతున్నారు ? అన్నదే ఆయన మద్దతుదారులను వేధిస్తున్న ప్రశ్న. అసలు ఏం జరుగుతోందా అని ఆరాతీస్తే కడప జిల్లాకే చెందిన నేత, టిడిపి ఫిరాయింపు రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ కారణమని ప్రచారం జరుగుతోంది.

 

ఇద్దరూ టిడిపిలోనే ఉన్నపుడు ఒకరంటే మరొకరికి పడేది కాదు. ఆది నారాయణరెడ్డి ఏమో కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీకి రెండుసార్లు ఎన్నికైన నేత. రమేష్ ఏమో ధనబలంతో టిడిపిలో  రాజ్యసభకు ఎన్నికైన నేత. అంటే రమేష్ కు క్షేత్రస్ధాయిలో ఏమాత్రం బలం లేదు. ఏదో చంద్రబాబునాయుడుకు సన్నిహితుడు కాబట్టి జిల్లాలో చెలాయించుకుని వస్తున్నారు. అయితే ఆది కూడా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించటం వెంటనే మంత్రి కూడా కావటంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.

 

ఇద్దరి మధ్య ఆధిపత్య రాజకీయాలతో మధ్యలో చాలామంది నేతలు నలిగిపోయారు. ఇటువంటి అనేక కారణాల వల్లే కడప జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో పార్టీ భవిష్యత్తుపై నమ్మకం పోవటంతో పాటు స్వీయ రక్షణకు రమేష్ వెంటనే బిజెపిలోకి ఫిరాయించారు.

 

భవిష్యత్తుపై ఆందోళనతోనే మాజీ మంత్రి కూడా బిజెపిలో చేరాలనుకున్నారు. అయితే ఇక్కడే రమేష్ అడ్డు పడుతున్నట్లు సమాచారం. ఆది గనుక బిజెపిలో చేరితే మళ్ళీ జిల్లాలో గొడవలు తప్పవన్న ఉద్దేశ్యంతోనే ఆదిని బిజెపిలోకి రానీయకుండా రమేష్ అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. జనాల్లో అంతో ఇంతో బలమున్న ఆదిని బిజెపి వదులుకుంటుందా అన్నదే ప్రశ్న. కాకపోతే నాలుగు రోజులు ఆలశ్యం జరగవచ్చేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: