శాసనసభ ఎన్నికల ముందు వరకు హరీశ్ రావు టీఆర్ ఎస్ లో కీలక నేత. తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆయనకు కీలకమైన నీటి పారుదల శాఖను కట్టబెట్టారు. పార్టీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా కేసీఆర్ నోట తొలుత హరీష్ పేరొచ్చేది. అందుకు తగ్గట్లే హరీష్ మామకు తలలో నాలుకలా వ్యవహరించేవారు, ట్రబుల్ షూటర్ గా అవతరించారు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరానికి పరుగులెత్తించిన హరీష్ ఎన్నికల సమయానికే తుది దశకు తీసుకువచ్చారు. కాలంతో పోటీ పడి పనులు చేయించి కాళేశ్వరరావుగా పేరు తెచ్చుకున్నారు.



గతేడాది డిసెంబరులో అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నుంచి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది.హరీష్ కు ప్రాధాన్యం తగ్గింది, ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కేటీఆర్ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాగా, హరీష్ కు అసలు మంత్రివర్గంలోనే చోటు దక్కలేదు. తొమ్మిది నెలలుగా ఆయన సొంత నియోజకవర్గం సిద్దిపేటకే పరిమితం అయ్యారు, జనంలో ఉంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత అసెంబ్లీలో కాంగ్రెస్ టిడిపిలను దిగ్విజయంగా ఖాళీ చేయించిన కేసీఆర్, కేటీఆర్ దూకుడుకు లోక్ సభ ఎన్నికల తరువాత కళ్లెం పడింది.



టిఆర్ ఎస్ కంచుకోటలైన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు, రాజధాని నగరంలో బీజేపీ దూకుడు పెరిగింది.ఈ నేపథ్యంలోనే తాజా మంత్రి వర్గ విస్తరణలో ఊగిసలాట మధ్య హరీష్ కు బెర్తు ఖరారైనట్లు తెలుస్తోంది. అప్పటి వరకు నెలకొన్న వాతావరణం చూసి చాలా మంది టీఆర్ ఎస్ ముఖ్యులు హరీశ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోక పోవచ్చని అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా ఆయనను కేబినెట్ లోకి తీసుకున్నారు.



బిజెపి కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటు టీఆర్ ఎస్ లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే హరీష్ కు క్యాబినెట్ బెర్తు దక్కినట్టు తెలుస్తోంది.కేసీఆర్ ఇంట్లో ఆహ్వానం పలకడంలోను మంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక మీద హరీష్ కు ప్రాధాన్యమిచ్చిన తీరు ఆయనకు కీలకమైన ఆర్ధిక శాఖ అప్పగించటం ఇవన్నీ చర్చనీయాంశమయ్యాయి.భారీ ప్రాజెక్టులను నెత్తికెత్తుకున్న తరుణంలో ఆర్థికమాంద్యం ముంచుకొచ్చి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాట నిజం.



తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్నప్పటికీ అనేక బిల్లుల చెల్లింపులో విపరీత జాప్యం తప్పడం లేదు. సీఎం కేసీఆర్ కు సమాచారం లేకుండా ఆర్థికశాఖ నుంచి ఏ బిల్లును చెల్లించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పరిణామాల మధ్య హరీష్ కు ఆర్థిక శాఖను కేటాయించటం గమనార్హం. అయితే ఈ నేపథ్యంలో ఆర్ధికం అప్పగించడం, ట్రబుల్ షూటర్ గా ఆయన సేవలను ఉపయోగించుకోవడానికా, మంత్రిగా చోటు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండని శాఖ ఇచ్చి సరిపుచ్చుతున్నారా అనే చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: