తెలుగుదేశంపార్టీ నేతల్లో ఒక్కొక్కరు పరారీ అయిపోతున్నారు. కేసుల్లో ఇరుక్కోవటం పోలీసుల విచారణకు హాజరు కావాలనేటప్పటికి పరారీ అయిపోవటం మామూలు అయిపోయింది.  ఇప్పటికి నలుగురు సీనియర్ నేతలు పరారీలో ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పరారీ జాబితాలో చేరిపోయారు. ఈయన కూడా పోలీసు విచారణకు హజరుకావాల్సుంది.

 

అధికారంలో ఉన్నపుడు సోమిరెడ్డితో పాటు మాజీ ఎంఎల్ఏలు చింతమనేని ప్రభాకర్, కోడెల కుటుంబం, కూన రవికుమార్, యరపతినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు విపరీతమైన అధికారాలను అనుభవించారు. ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధులపై  చెలరేగిపోయారు. చివరకు అధికారానికి దూరమైనా అలవాటైపోయిన ధోరణులను మాత్రం వదలుకోలేకపోయారు. దాంతో చిక్కుల్లో పడ్డారు.

 

 ముందుగా కూన రవికుమార్ ఓ ఎంపిడివోను నోటికొచ్చినట్లు తిట్టారు. చంపుతానని బెదిరించిన వీడియాలు బయటకు వచ్చేసరికి అల్లరైంది. దాంతో పోలీసులు కేసు పెట్టారు. అరెస్టు భయంతో పరారీలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వంతు చింతమనేని ప్రభాకర్ ది. ఈయనకు రౌడీ ఎంఎల్ఏ అని పేరుంది. ఎందుకంటే ఈయనపై దాదాపు 40 కేసులున్నాయి. ఎదుటివాళ్ళపై దౌర్జన్యాలు చేయటం, నోటికొచ్చినట్లు తిట్టటం ఈయనకున్న అలవాటు. అదే పద్దతిలో ఇపుడు కూడా ఓ ఎస్సీ వ్యక్తిని తిట్టినందుకు కేసు నమోదైంది. అరెస్టు నుండి తప్పించుకునేందుకు పరారయ్యాడు.

 

తర్వాత అక్రమ మైనింగ్ డాన్ యరపతినేనిది కూడా ఇదే పద్దతి. అక్రమ మైనింగ్ లో వందల కోట్ల రూపాయలు సంపాదించారు. తన సంపాదనకు అడ్డొచ్చిన వారిని పోలీసు కేసుల్లో ఇరికించారు. బాధితులిపుడు పెట్టిన కేసులతో అరెస్టు నుండి తప్పించుకునేందుకు పరారయ్యారు. సరే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే. ఇద్దరిపైనా సుమారు 20 కేసులున్నాయి. అరెస్టు నుండి తప్పించుకుని పరారీలో ఉన్నారు. తాజాగా సోమిరెడ్డి కూడా వీరితో జత కట్టారు. తనది కాని భూమిని తన భూమిగా చెప్పి అమ్మేశారని అరోపణలున్నాయి. ఆ కేసులోనే పోలీసులు విచారణకు పిలిచారు. అరెస్టు భయంతో పరారీలోకి వెళ్ళిపోయారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: