ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు అన్ని పండుగల మాదిరిగానే మోహరం నాడు సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి కాలరీస్‌ మొహరం రోజు హాలిడే ప్రకటించడంలో ఓ ప్రత్యేకత ఉంది. మరోవైపు సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం ఆదివారం మాత్రమే సెలవు ప్రకటించగా.. ఇల్లందు ఏరియాలో మాత్రం శుక్రవారం సెలవు ఉంటుంది. ఇల్లందు ఏరియాలోనే ఇలాంటి మార్పు ఎందుకు..?  ఏమిటా ప్రత్యేకత...?


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో బ్రిటిష్ భూగర్భ పరిశోధన అధికారి విలియం కింగ్ 1871లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశాడు. బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ది దక్కన్ కంపెనీ లిమిటెడ్‌ అనే ప్రైవేట్ కంపెనీ 1886లో త్రవ్వకాలను ప్రారంభించింది.1889 నాటికి ఉత్పత్తి మొదలుపెట్టింది. బొగ్గును సింగరేణి అనే గ్రామం వద్ద కనిపెట్టడంతో 1920 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చుతూ పబ్లిక్ లిమిటెడ్ చేశారు. ఇల్లందులో అండర్ గ్రౌండ్ ద్వారా బొగ్గుని వెలికి తీస్తుంటారు. 1938 మార్చి 12న ఘోర గని ప్రమాదం జరిగింది. పూస పల్ల సమీపంలో స్టట్ ఇంక్లైన్ భూగర్భ గనిలో విషవాయువులు వ్యాపించాయి. అప్పటి బ్రిటీష్‌ అధికారులు, కార్మికులు, మొత్తం 43 మంది విషవాయువుల కారణంగా  మృతి చెందారు. సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలోనే ఇది పెద్ద ప్రమాద సంఘటన. 


కార్మికులు మృతి చెందిన రోజు శుక్రవారం. వారి మృతికి జ్ఞాపకార్ధంగా అప్పటి బ్రిటీష్ గవర్నమెంట్ ఇల్లందు ఏరియాలో శుక్రవారం సెలవుగా ప్రకటించింది. అదేవిధంగా మొహరం రోజే ప్రమాదం జరిగినందున ప్రతి సంవత్సరం మొహరం పండుగకు సింగరేణి వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. కార్మికులు మృతి చెందిన  స్టట్ ఇంక్లైన్ వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీ స్థూపాన్ని నిర్మించింది. ఇక్కడి 24 ఏరియాలో మృతుల సమాధులను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆనవాయితీని.. ఇప్పటి సింగరేణి యాజమాన్యం కొనసాగిస్తుంది.  శుక్రవారం ఇల్లందు ఏరియాకు మాత్రమే వారాంతపు సెలవు. మిగిలిన అన్ని సింగరేణి ఏరియాలలో ఆదివారం సెలవుగా ఉంది. 


కార్మికుల మృతి చెందిన రోజున ఇల్లందు ఏరియా సింగరేణి అధికారులు సంస్మరణ సభ నిర్వహించి మృతులకు నివాళులు అర్పిస్తారు. ఇల్లందు ఏరియా చరిత్రలో నిలిచిపోయే విధంగా బొగ్గు ఉత్పత్తిని సాధించింది. కోట్ల సంపదను ఈ దేశానికి అందించింది. ఇందుకోసం అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఇల్లందును తరతరాలుగా గుర్తుండి పోయేలా పర్యాటక కేంద్రంగా మార్చాలని, మ్యూజియంలు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: