గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనం సందడి కూడా మొదలైపోయింది వినాయకుని ప్రతిష్టించిన మూడో రోజు నుంచే నిమజ్జన ప్రక్రియ ఆరంభమైంది. పన్నెండున జరిగే ప్రధాన నిమజ్జనంతో గణేశుడి నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. నిమజ్జనోత్సవానికి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిర్వహించటం పోలీసులకు సవాలే. అయితే పోలీసులు చాలెంజింగ్ గా తీసుకుంటున్నారు, శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, సిటీపై నిఘా పెట్టారు, నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద ఒక పోలీసును వీధుల్లో ఉంచారు. వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశారు, సమస్యాత్మక ప్రాంతమైన పాతబస్తీలో ప్రత్యేక నిఘా పెట్టారు.


నిమజ్జనం రోజున వినాయకుడు భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా బాలాపూర్ వినాయకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ దర్శించుకున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్న రూట్ మ్యాప్ ను పరిశీలించారు. చంద్రాయణగుట్ట, చార్మినార్, మదీన, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వరకు బాలాపూర్ గణేష్ ఊరేగింపు ఉంటుంది. నిమజ్జనం కోసం దాదాపు ఇరవై ఒక్క వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా బందోబస్తులో పాల్గొంటాయి.


గణేష్ నిమజ్జన ఊరేగింపు జరిగే రూటు మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. అన్ని కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. గణేశ్ నవరాత్రులలోనే మొహర్రం వచ్చింది. దీంతో పాతబస్తీలోని మండపాల నుంచి విగ్రహాలను త్వరగా నిమజ్జనానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు. పాతబస్తీలోని మసీదులపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అలర్ట్ గా ఉండాలని పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.


నిమజ్జనం కోసం జీహెచ్ ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముప్పై రెండు క్రేన్ లను అందుబాటులో ఉంచుతుంది. ముప్పై రెండు వేల మంది కార్మికులు నిమజ్జనం విధుల్లో పాల్గొంటారని జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ తెలిపారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి క్రేన్ వద్ద నిమజ్జనమయ్యే విగ్రహాల వివరాలను నమోదు చేస్తారు. నిమజ్జనోత్సవం కోసం భక్తులు భారీ ఎత్తున తరలి వస్తారు. దీంతో అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అలజడులు చెలరేగకుండా అడుగడుగునా నిఘా పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: