పల్నాడులో రాజకీయం భగ్గున మండుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక గ్రామంలో వివాదాలు సద్దుమనుగుతుంటే మరో గ్రామంలో కొట్లాటలు మొదలవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధశిరిలో రాత్రి పెద్ద దుమారం చెలరేగింది. వినాయకుడి నిమజ్జనంలో మొదలైన గొడవ రాజకీయ కక్షల దాకా వెళ్లింది. దీంతో గ్రామాల్లోనే రెండు వర్గాలు చెరో పార్టీగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో కిలారి శ్రీను, కిలారి సాంబయ్యతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి మళ్లీ దుమారం చెలరేగి ప్రత్యర్థి వర్గాల వారు ట్రాక్టర్ లు బైక్ లను ధ్వంసం చేశారు.


దీంతో రాత్రి నుంచి గ్రంధశిరిలో దుమారం ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇటు నిన్నటి దాకా ఉద్రిక్తంగా ఉన్న ఆత్మకూరులో ఇప్పుడు శాంతి నెలకొంది. గ్రామాలని వదిలి వెళ్లిన వారంతా తిరిగి సొంత ఇళ్ళకు చేరుకున్నారు. పోలీసులు తీసుకున్న పటిష్టమైన చర్యలతో గ్రామంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఒకే గ్రామంగా ఉండి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయ పార్టీల కోసం విడిపోయి ఘర్షణలకు దిగడం ఏంటని పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. దీంతో ఇరువర్గాల వారు మళ్లీ కలిసిపోయారు. దీంతో ఆత్మకూరు పూర్తిస్థాయిలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. పునరావాస శిబిరంలో ఉన్న వారిని పోలీసులు రక్షణతో తీసుకెళ్లి గ్రామాల్లోని వాళ్ల ఇళ్లకు చేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.


పోలీసులు తీసుకెళ్లక పోతే తామే ఛలో ఆత్మకూరు పేరిట అందరినీ గ్రామాలకూ తీసుకెళతామని చంద్రబాబు కూడా ప్రకటించారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులు స్వయంగా పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడున్న బాధ్యుతలతో చర్చించారు. పూర్తి భద్రత మధ్య తామే స్వయంగా వారిని ఊళ్లకు తీసుకెళతామని భరోసా ఇచ్చారు. మీ రక్షణార్ధం మా బాధ్యత అని హామీ ఇచ్చారు. పోలీసులే స్వయంగా వచ్చి భరోసా ఇవ్వడంతో టిడిపి నేతలు చల్లబడ్డారు. పోలీసులు రక్షణ కల్పించి తీసుకెళ్తామంటే తప్పకుండా పంపిస్తామని చెప్పారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పై అధికారులతో తమకు పేచీ లేదని కింది స్థాయి పోలీసులతోనే సమస్యలొస్తున్నాయని చెప్పారు ఆయన.


మరింత సమాచారం తెలుసుకోండి: