తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితురాలైన త‌మిళ‌నాడుకు చెందిన నేత‌...త‌మిళిసై సౌందర్ రాజన్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. రాజ్‌ భవన్ అధికారులు, సిబ్బందితో ముచ్చటించిన ఆమె..  తెలంగాణకు వచ్చేముందే, రాష్ట్ర సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేశానని తెలిపారు. రాజ్‌ భవన్ లైబ్రరీని పరిశీలించిన ఆమె.. తన వ్యక్తిగత లైబ్రరీలో ఉన్న‌ దాదాపు ఐదువేల పుస్తకాలను త్వరలోనే రాజ్‌ భవన్‌ కు తీసుకొస్తానని తెలిపారు. రాష్ట్ర‌ ప్రజలతో స్థానిక భాషలోనే సంభాషించేందుకు ప్రయత్నిస్తానన్నారు. తెలుగు భాషను పద్నాలుగు రోజుల్లో నేర్చుకుంటానన్న నమ్మకమున్నదని గ‌వ‌ర్నర్  తెలిపారు. 


స్వతహాగా డాక్టర్ అయిన గవర్నర్.. రాజ్‌ భవన్ సిబ్బంది పూర్తి ఆరోగ్యంతో ఉండాలని సూచించారు.  సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలిగిన గవర్నర్.. వారు విధులు పక్కాగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యభూమిక పోషిస్తానని, అన్నిరకాలుగా మార్గదర్శిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా పార్టీలు కూడా రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.


రైతులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్నిరకాల సేవల్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. గోదావరి నీటిని సముద్రంలోకి వృథాగా పోనీయకుండా.. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, తాగునీరు వంటి అవసరాల కోసం వినియోగించుకునేందుకు తరలించడం గొప్ప విషయమన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీటిని ప్రజలకు ఉపయోగపడేందుకు వినియోగించడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీలో అద్భుత ప్రగతిని సాధించిందని, శాంతిభద్రతల పరిరక్షణ బాగుందని, మెట్రోతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నదని ప్రశంసించారు. వివిధ వృత్తుల కార్మికులకు, వివిధ వర్గాలకు సంక్షేమకార్యక్రమాలు అభినందనీయమన్నారు.  2018-19లో తెలంగాణ రాష్ట్రం 14.8 శాతం జీఎస్డీపీని సాధించిందని, 2014లో 4లక్షల కోట్లు ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్నదని ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: