చంద్రబాబునాయుడుకు డిసెంబర్ టెన్షన్ పెరిగిపోతోంది.  మామూలుగా అయితే టిడిపికి ఆగష్టు టెన్షన్ అందరికీ తెలిసిందే. కానీ డిసెంబర్ టెన్షన్ మాత్రం చంద్రబాబుకు బోనస్ అనే చెప్పాలి.  కారణం ఏమిటంటే డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటమే. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా లోకల్ బాడి ఎలక్షన్స్ అంటే ఉత్సాహంగా ఉండటం సహజం.

 

ఎందుకంటే అధికార పార్టీ చేసిన తప్పులను జనాల్లో ఎండగట్టి లబ్ది పొందటానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తారు. అందుకే ఎన్నికల్లో పోటి చేయటానికి ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర పోటి ఉంటుంది. కానీ ఇపుడు టిడిపి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది.  మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసిపి చేతిలో తిన్న చావుదెబ్బ చంద్రబాబుకు కాళరాత్రిలాగ తయారైంది.

 

సాధారణ ఎన్నికల్లో తిన్న చావుదెబ్బ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు. ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేకే నేతలు పార్టీని వదిలేసి వెళిపోతున్నారు. ఉన్న వాళ్ళు కూడా పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరనే చెప్పాలి. చాలామంది వైసిపిలో వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. చాలా జిల్లాల్లో నేతలు ఎప్పుడెప్పుడు వైసిపిలో చేరిపోదామా ? అన్నట్లుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

అసలు పార్టీలో ఉండటమే ఇష్టం లేని సమయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఏ మేరకు కష్టపడతారన్నది అనుమానమే. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలిచిన నేతలకు వచ్చే లాభం ఏమీ లేదు. కాబట్టి వైసిపిలో చేరి అధికార పార్టీ విజయానికి కృషి చేస్తారు. లేకపోతే టిడిపిలోనే ఉంటూ వైసిపి విజయానికి లోపాయికారీగా కృషి చేసేందుకే అవకాశాలున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. హామీలన్నింటిని గ్రౌండ్ చేయటానికి షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. దాంతో జనాల్లో సానుకూలత కనబడుతోంది. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా స్వీప్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో అసలు నుండి పోటి చేయటానికి గట్టి నేతలు టిడిపిలో దొరకుతారా ? అన్నదే సందేహం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: