ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా? రాష్ట్ర ప్రజలందర్ని వేధిస్తున్న ప్రశ్న ఇది.. రాజధానిపై భయాందోళనలు నెలకొన్న సమయంలో ప్రభుత్వం కమిటీని వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసమే కమిటీని వేశామంటూ వివరణ ఇచ్చారు. 


అర్బన్ ప్రాంతాల అభివృద్ధిపై ఏపీ సర్కార్ దృష్టిసారించింది. అమరావతి సహా..రాష్ట్రాభివృద్ధికి సలహాల కోసం ఐదుగురు సభ్యులతో  కమిటీ ఏర్పాటు చేసింది . రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి.. కమిటీ  పలు సూచనలు, సలహాలు ఇవ్వనుంది. ఆరు వారాల్లో  నివేదిక ఇవ్వాలని కమిటీని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం  ఉత్తర్వుల్లో సూచించింది. 


అయితే గత ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఉండగా.. కొత్త ప్రణాళిక కోసం ప్రభుత్వం కమిటీ వేయడంపై చర్చనీయాంశంగా మారింది. కేపిటల్  విషయంలో టీడీపీ తీరును విమర్శిస్తున్న జగన్ సర్కార్...శివరామకృష్ణన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజధాని గురించే కాకుండా సమగ్రాభివృద్ధిని ఆశించి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి బొత్స అన్నారు. కానీ గత ప్రభుత్వం ప్రీ ఆక్యుపైడ్ మైండ్‌తో ఉండబట్టి కమిటీ నివేదికను పట్టించుకోలేదని విమర్శించారు. 


రాజధానితో పాటు నగరాల అభివృద్ది కోసం... వరదనీటి యాజమాన్యం గురించి కూడా నివేదించాలని కమిటీకి జగన్ ప్రభుత్వం సూచించింది. రాజధాని విషయంలో ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఏముందనేదానిపై చర్చ జరుగుతోంది  మొత్తం మీద అమరావతి రాజధానిగా కొనసాగింపు.. భవిష్యత్ నిర్మాణాల పైన ఈ కమిటీ చేసే సిఫారసులు కీలకం కానున్నాయి. ఆరు వారాల్లో నివేదిక రానుండటంతో కమిటీ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: