కోడెల రాజకీయ నాయకుడిగా అభివృద్దిని పరుగులు పెట్టించడమైనా, శివ భక్తుడిగా ఆ పరమేశ్వరునికి చేసిన సేవలైనా ఆయన్ను ఒక ప్రత్యేక నేతగా నిలబెట్టాయి. కానీ అంతకు మించి డాక్టర్ కోడెల  శివ ప్రసాద్‌గా ఆయన సేవలు చిరస్మరణీయం.


డాక్టర్ గారు... ఆ రోజుల్లో ఈ పిలుపే ప్రాణం పోసేది. వైద్య వృత్తిలో కోడెలకు సాటిలేరు. పేదల డాక్టర్‌గా పేరుగాంచారు. ఆయన చేతివైద్యం కోసం చాలా మంది ఎదురు చూసేవారు. ఎప్పుడు ఎవరికి అనారోగ్యం వచ్చినా వెంటనే వారు కోడెలను సంప్రదించేవారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు, డాక్టర్ మర్రి పెద్దయ్యా, డాక్టర్ మోపర్తి వెంకటేశ్వర్లు, వీరు ముగ్గురు కలసి 1976 ఒకేసారి నరసరావుపేటలో ప్రాక్టీసు ప్రారంభించారు. కోడెల శివప్రసాదరావుతో తమకు 40 ఏళ్ల పరిచయం ఉందని స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్నారు.


కోడెలకు వైద్యం అంటే చాలా ఇష్టం. కానీ అంతకన్నా ఇష్టం అయిన మరో వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పిలుపు అందుకున్న కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఆయనలో మరో కోణం బయటకు వచ్చింది. వైద్య వృత్తితో పాటు నాయకత్వం అందిపుచ్చుకుని తిరుగులేని నేతగా ఎదిగారు. స్నేహశీలిగా ఉండే కోడెల రాజకీయాల్లోకి వెళ్లి తమకు కాస్త దూరమైనప్పటికీ, అడపాదడపా వైద్యంలో సలహాలు సూచనలు చేసేవారని స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. కోడెల శివప్రసాదరావు శాసన సభ్యుడుగా అనేక పర్యాయాలు గెలిచి మంత్రి పదవులు దక్కినా పేదల వైద్యం కోసం ఎప్పుడూ పరితపించే వారని స్నేహితులు అంటున్నారు. వైద్య వృత్తికి, రాజకీయ రంగానికి కూడా కోడెల వన్నె తెచ్చారనీ, డాక్టర్ గా మంచి ప్రాక్టీస్ వదులు కొని ప్రజాసేవ చేశారనీ..  రాజకీయాల్లోకి ప్రవేశించి నరసరావుపేటను ఎంతో అభివృద్ధి చేశారని ఆయన మిత్రులు అంటున్నారు. తమ ఆత్మీయ మిత్రుడు కోడెల శివప్రసాద రావు  ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: