రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. కడప జిల్లాలో దాదాపు ద‌శాబ్దం త‌రువాత మైల‌వ‌రం జ‌లాశ‌యం నుంచి పెన్నాన‌దిలోకి నీటిని పెద్ద ఎత్తున విడుద‌ల చేశారు. ప‌దుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. బ‌య‌ట ప్రపంచంతో రాక‌పోక‌లు తెగిపోయాయి. ఇక కర్నూలు జిల్లాలోనూ నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలతోపాటు మరికొన్ని మండలాలను అతలాకుతలం చేశాయి. దాదాపు 10 మండలాల్లో జనజీవనం స్థంభించి పోయింది. వరద నీటి ఉధృతికి మహానంది ఆలయం జలదిగ్బంధమై దర్శనాలను రద్దు చేశారు. 


క‌డ‌ప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో వాగులు వంక‌లు, పెన్నా, కుందూ న‌దులు పొంగి ప్రవ‌హిస్తున్నాయి. కుందూ, పెన్నా ప‌రీవాహ‌క ప్రాంతాల్లో కృష్ణమ్మ ఉర‌క‌లేస్తోంది. ద‌శాబ్ద కాలం త‌రువాత జిల్లాలోని మైల‌వ‌రం జ‌లాశ‌యం నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటికి పెన్నా న‌దిలోకి విడుద‌ల చేశారు. ఇన్‌ఫ్లోను బ‌ట్టి మైల‌వ‌రం నుంచి కింద‌కు నీటి విడుద‌లకు పెంచుతూ పోతున్నారు. పెన్నా, కుందూ ప‌రిధిలోకి వ‌చ్చే జ‌మ్మల‌మ‌డుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, క‌మ‌లాపురం, పులివెందుల‌, క‌డ‌ప త‌దిత‌ర ప్రాంతాల్లో వాగులు వంక‌లు ప్రమాదక‌ర స్థాయిలో ప్రవ‌హిస్తున్నాయి. చాలా గ్రామాల‌ నుంచి బ‌య‌ట ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న క‌ల్వర్టులు, క‌ట్టలు కొట్టుకుపోయాయి.   


ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కుందూ, పెన్నా న‌దులు ఉధృతంగా ప్రవ‌హిస్తున్నాయి. కామ‌నూరు స‌మీపంలో వంక‌లో  ఆటో నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు ర‌క్షించేందుకు చేసిన ప్రయ‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఒక్కసారిగా వ‌ర‌ద నీరు ప్రవ‌హించ‌డంతో వేల ఎక‌రాల్లో పంట భూములు మునిగిపోయాయి. విద్యుత్ మోటర్లు, వ్యవ‌సాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సోలార్ సిస్టమ్‌, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా కొట్టకుపోయాయి. 


ఎగువన కురుస్తున్న వర్షానికి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో గండికోట నుండి మైలవరం రిజ‌ర్వాయ‌ర్‌కు 30 వేల క్యూసెక్కుల‌ నీటిని విడుదల చేస్తున్నారు. మైల‌వ‌రం నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా న‌దిలోకి విడుద‌ల చేస్తున్నారు. ఎప్పుడూ లేనంత‌గా నీటిని ఇంత పెద్ద ఎత్తున విడుద‌ల చేయ‌డంతో లోత‌ట్టు ప్రాంతాల ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని, వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరే ప్రమాదం ఉన్న గ్రామాల వారు సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.  


సీఎం జగన్ సొంత నియోజ‌క‌వ‌ర్గమైన పులివెందుల‌లో కూడా భారీ వ‌ర్షం కురిసింది. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి మండలాల్లో భారీ  వర్షం  కార‌ణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సింహాద్రిపురం, వెలిదండ్ల గ్రామాల మధ్యలో రాకపోకలు నిలిచిపోవ‌డంతో ప్రజ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా గత 10ఏళ్లుగా ఇంత వర్షం కురవలేదని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా అంత‌టా భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం, కుందూ పెన్నా న‌దులు ప్రమాద క‌ర స్థాయిలో ప్రవ‌హిస్తుండ‌టంతో అన్నిశాఖల అధికారుల‌ను జిల్లా క‌లెక్టర్ హ‌రికిర‌ణ్ అప్రమ‌త్తం చేశారు. అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్యలు అందించేందుకు అంద‌రు అధికారుల‌ను అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా ప్రమాదంలో చిక్కుకుంటే ర‌క్షించేందుకు వీలుగా రెస్క్యూ టీంల‌ను కూడా సిద్ధంగా ఉంచారు. గ‌జ ఈత‌గాళ్లు, మ‌త్స్యశాఖ‌, ఇరిగేష‌న్‌, ఫైర్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీసుల‌ను రంగంలోకి దించారు.  


మరోవైపు కర్నూలు జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ పూర్తిగా, బనగానపల్లి నియోజకవర్గంలో పాక్షికంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో కుందూ నది, మద్దిలేరు, వకులవాగు, పాలేరువాగుతోపాలు చిన్న వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చెరువులకు గండ్లుపడ్డాయి. కాలనీలు, రహదారులు, వేలాది ఎకరాల పంట నీట మునిగాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మహానంది ఆలయం జలమయమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: