పల్నాడులో తిరుగులేని నేత కోడెల శివప్రసాదరావు. నర్సరావుపేటలో వైద్యవృత్తితో ప్రజల మనసును చూరగొన్న డాక్టర్ కోడెల, ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ తిరుగులేని నేతగా ఎదిగారు. అన్నగారి పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 


డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వివిధ మంత్రిత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... కోడెల శివప్రసాద్‌రావుకు భార్య శశికళ, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. ముగ్గురు పిల్లలు కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు.  


గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆ రోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేశారు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో మళ్ళీ పీయూసీలో చేరి.. మంచి మార్కులు తెచ్చుకొని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివారు.   


గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు తను చదివిన వైద్యవిద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తన స్వంత ఆసుపత్రిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించారు. వాళ్ళ అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు. అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా మంచి సేవలందిస్తూ, నమ్మకమైన సర్జన్‌గా పేరుప్రతిష్టలు పొందారు.    


కోడెల రాజకీయంగానే కాక అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. ప్రతీ సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెలకు ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి గతంలో ఒక చరిత్ర సృష్టించారు. 


మరోసారి తన పుట్టినరోజు సందర్భంగా, తన మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో  పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ఎత్తున అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సాధించేలా చేశారు.   


అభివృద్ధితోనే అంతరాలు తొలుగుతాయని ప్రగాఢంగా నమ్మేవారు డాక్టర్ కోడెల. జన్మభూమిపై మమకారంతో గ్రామస్తులు , దేశ, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో పల్లెకు పోదాం... కార్యక్రమాన్ని ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ రోజున ఆనవాయితీగా జరిపేవారు. రాష్ట్ర రాజకీయాలలో, ప్రజల మనసుల్లో పల్నాటిపులిగా, అభివృద్ధి ప్రదాతగా, స్పూర్తి ప్రదాతగా తనదైన ముద్రవేసుకున్నారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: