న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం తవ్వకాల ర‌గ‌డ కొన‌సాగుతోంది. త‌వ్వ‌కాల‌కు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడాన్ని ప్రజాఉద్యమ విజయంగా భావిస్తున్నామని నల్లమల పరిరక్షణ కమిటీ బాధ్యుడు ప్రొఫెసర్​ జయధీర్​ తిరుమలరావు చెప్పారు. ఈ నేపథ్యంలో నల్లమలలో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 


ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ....సరిగ్గా పదేళ్ల క్రితం వజ్రాల వెలికితీత పేరుతో నల్లమలను డిబీర్స్ అనే కంపెనీకి అప్పగించేందుకు, ఇందుకోసం అక్కడి చెంచులను అడవి నుంచి తరలించేందుకు అప్పటి  కాంగ్రెస్​ సర్కారు కుట్ర పన్నింది. అప్పట్లో ప్రజాసంఘాల ఉద్యమంతో వెనక్కి తగ్గింది. ఇన్నేళ్ల తర్వాత యురేనియం తవ్వకాల పేరిట నల్లమల చెంచు పెంటల్లో మరోసారి మంటలు రేగుతున్నాయ‌ని తెలిపారు. యురేనియం తవ్వకాల కారణంగా వెలువడే రేడియేషన్​తో  చెంచు జాతితో పాటు అరుదైన జంతువులు, చెట్లు, అంతరించిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నా సర్కారు తన పని తాను చేసుకుపోతున్నది. ఈ విషయంలో నాటి ఇంగ్లీష్  పాలకులకున్న సోయి  నేటి ప్రభుత్వాలకు లేదనే వాదన వినిపిస్తున్నది. 1920–-30 ప్రాంతంలో నల్లమలను టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని అప్పటి బ్రిటిష్​ సర్కారు సంకల్పించింది. బలవంతంగా చెంచుల తరలింపు మొదలుపెట్టింది. కానీ మైదాన ప్రాంతాలకు చేరగానే చెంచులు పిట్టల్లా రాలిపోవడాన్ని చూసి కలవరం చెందింది.


అప్పటికప్పుడు సుందరన్ అనే సివిల్​ సర్వీసెస్​ ఆఫీసర్  ఆధ్వర్యం లో ఓ టీంను  నల్లమలకు పంపి, చెంచుల జీవన విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించింది. ఆ నివేదిక చూసి బ్రిటిష్​ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. చెంచులు ఒక అరుదైన ఆదిమ జాతి అనీ, పులుల కన్నా అపురూపమైన వారని తేల్చడంతో  టైగర్‌జోన్ అనే ఆలోచనను విరమించి ‘చెంచు రిజర్వ్’ ఏర్పాటు చేసింది.  వారి ని కాపాడటంలో  భాగంగా1930 లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని అప్పాపూర్‌లో ఓ ఆసుపత్రిని కూడా నిర్మించింది. కానీ ఇప్పుడు  కార్పొరేట్​ సంస్థల ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి అనేక ఆదిమ జాతుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు.  ఉదాహరణకు ఆదిలాబాద్‌లో కవ్వాల టైగర్ జోన్ పేరిట పెద్ద సంఖ్యలో గోండుగూడాలను తరలించే ప్రక్రియలో  కేంద్ర, రాష్ట్రాలు దాదాపు విజయం సాధించాయ‌ని...చెంచులు అలాగే అంత‌రించ‌వ‌చ్చ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: