పాపి కొండలు చూడాలని ముచ్చట..తమ వాళ్లతో హ్యాపీగా బోటులో షికారు చేస్తూ..గోదారమ్మ ప్రకృతి అందాలు ఆస్వాదించాలని అందరూ బయలుదేరారు. కానీ విధి వైపరిత్యం..గోదారమ్మ కన్నెర్రజేసింది..సుడిగుండం రూపంలో బోటులో ప్రయాణిస్తున్న వారి పాలిట శాపంగా మారింది..ఒక్కసారై బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న కొద్ది మంది తప్పించుకోగా..ఇప్పటికీ మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది. ఇక బుధవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 33 మృతదేహాలు లభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.  ప్రమాదం జరిగిన కచ్చలూరు దేవీపట్నం, పట్టిసీమ, పోలవరం, తాళ్లపూడి వద్ద మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. బోటు మునిగి మూడు రోజులు కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయాయని, మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే ఆ బోటు ఆచూకి లభిస్తే..అందులో ఇంకా ఏమైనా మృతదేహాలు చిక్కుకొని ఉన్నాయా అన్న విషయం క్లారిటీకి వస్తుందని తెలుస్తుంది.  అయితే బోటు ఆచూకి నిన్నటి వరకు లభ్యం కాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద నీట మునిగిన బోటు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. నాలుగు రోజుల తర్వాత దాని జాడను కనుగొన్నారు. ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందం తమ వద్దనున్న అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగించి బోటు 200 అడుగులో ఉన్నట్టు గుర్తించింది.అయితే దానిని బయటకు తీయడం ఎలా? అన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేడు వెలికితీత పనులు మొదలుకానున్నాయి.

ఈ నేపథ్యంలో బోట్లను వెలికితీయడంలో విశేష అనుభవం ఉన్న కాకినాడకు చెందిన మత్స్యకారుడు ధర్మాడి సత్యం, అతడి సహాయ సిబ్బంది 25 మందిని అధికారులు రప్పించారు.  కాకపోతే బోటు చిక్కుకున్న ప్రాంతం సుడిగుండాల వలయాలు ఉండటంతో సహాయక చర్యలకు వెళ్లే బోట్లను సైతం లోపలికి లాగేసుకునే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోపక్క బోటును వెలికి తీసేందుకు ముంబై నుంచి సాల్వేజ్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన నిపుణుడు గౌరవ్ భక్షిని రప్పించారు. 

అక్కడి పరిస్థితిని భక్షీ పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క వర్షాల తాకిడి కూడా బాగానే ఉంది. జోరున కురుస్తున్న వర్షం, సహకరించని వాతావరణం మధ్య వీరి ప్రయత్నాలు ఏమేరకు సఫలీకృతం అవుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: