హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మాజీ టీం ఇండియా కెప్టెన్‌ అజారుద్దీన్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ ప్యానెల్‌ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నో అవరోధాలు... ఆరోపణలు... తగాదాల మధ్య జరుగుతున్న ఎలక్షన్‌ కావడంతో ఉత్కంఠ నెలకొంది. 


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రెటరీ, ట్రెజరర్‌ పోస్టులకు నామినేషన్లు దాఖలవుతున్నాయి. టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్‌ వివేక్‌ ప్యానెల్‌ నామినేషన్‌ ఫైల్‌ చేశారు. అజ్జూ వర్సెస్‌ వివేక్‌ అన్నట్టు పోటాపోటీగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 


226 మంది ఓటర్లున్న హెచ్‌సీఏలో ప్రధాన పోటీ వివేక్‌, అజారుద్దీన్‌ల మధ్యే. గత ఎన్నికల్లోనే అజారుద్దీన్‌ బరిలో నిలిచినా.. ఎన్నికల అధికారి అతడిపై వేటు వేశారు. లోథా కమిటీ సిఫార్పుల ప్రకారం మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ హోదాలో అజ్జూ ఈ సారి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈసారైనా అజార్‌ ను అదృష్టం వరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. 


ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా విక్రమ్‌ మాన్‌ సింగ్‌, సెక్రెటరీగా అజ్మల్‌ అసద్‌, జాయింట్‌ సెక్రెటరీగా శ్రీనివాస్‌ పట్టపు, మనోహర్‌ రెడ్డి, ట్రెజరర్‌గా శ్రీనివాసరావు, ప్రకాశ్‌ రావు, కౌన్సిలర్‌గా అనురాధ నామినేషన్లు ఫైల్‌ చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ పై హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ కోర్టు అనర్హత వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా వివేక్‌ అధ్యక్ష పదవిలో కొనసాగరాదంటూ.. తీర్పునిచ్చింది. హైకోర్టు కూడా తీర్పును సమర్థించింది. మరోసారి విరుద్ధ ప్రయోజనాల నిబంధన అడ్డొస్తే... ప్రస్తుత ఉపాధ్యక్షుడు అనిల్‌ అధ్యక్షుడి రేస్‌లో నిలిచే అవకాశముంది. 


హెచ్‌సీఏ మెంబర్‌, మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ సపరేట్‌గా ప్యానెల్‌ పెట్టుకుని.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు పావులుకదుపుతున్నాడు. మొన్నటిదాకా అర్షద్‌ ఆయూబ్‌ ప్యానెల్‌లో ఉన్న శివలాల్‌ యాదవ్‌.. తన మిత్రులతో చర్చలు జరుపుతున్నాడు. శివలాల్‌ ను బుజ్జగించే పనిలో పడ్డారు అజార్‌, అర్షద్‌ ఆయూబ్‌. ఎన్నో అవినీతి ఆరోపణలు, పరస్పర తగాదాలు, అడ్డంకుల మధ్య... జరుగుతున్న ఎన్నికలు కావడంతో హాట్‌హాట్‌గా మారింది. రెండు ప్యానెళ్ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ... పంతం నీదా నాదా సై అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: