తెలంగాణ కాంగ్రెస్‌లో హుజూర్‌నగర్ కాక కొనసాగుతోంది..! ఉపఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గరంగరంగా ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి సలహాలు సూచనలు తమకు అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు.  


హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అభ్యర్ధి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి అభ్యర్ధిత్వాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం పార్టీలో రాజకీయ దుమారానికి కారణమైంది. రేవంత్ రెడ్డి... కిరణ్ కుమార్ రెడ్డి పేరును తెరపైకి తేవడాన్ని నల్గొండ జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. హుజూర్ నగర్ లో ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలో తమకు తెలుసన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి సలహాలు, సూచనలు తమకు అవసరంలేదని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతే సరైన అభ్యర్థన్నారు.  


రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు తనకే కాదని, జానారెడ్డికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నది వాస్తవమే అయినా ఇప్పుడు జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామన్నారు. కాంగ్రెస్ లోని పాత తరం నేతలంతా పీసీపీ అధ్యక్షుడిగా తననే ఉండమంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పాతతరం నేతలను కాదని అభ్యర్థిని ప్రకటిస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  


మరోవైపు హుజూర్‌నగర్ లో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని అభ్యర్ధి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు ఉత్తమ్‌కు ఉందన్నారు జగ్గారెడ్డి. అభ్యర్థిగా ఎవరు పోటీ పడ్డా తుది నిర్ణయం మాత్రం హైకమాండే చేస్తుందన్నారు. మొత్తానికి హుజూర్‌నగర్ ఉపఎన్నికల ప్రకటన రాకముందే కాంగ్రెస్‌లో టిక్కెట్ పోరు తారాస్థాయికి చేరింది. రేవంత్ వర్సెస్ నల్గొండ జిల్లా నేతలలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: