టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు యాజమాన్యానికి డిమాండ్ల నోటీసులు అందజేశారు. గత నాలుగేళ్లుగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయనీ, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా వేతన ఒప్పందం, పే స్కేల్ వంటి అంశాలపై కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధం అంటున్నాయి.


హైదరాబాద్​ బస్ భవన్​లో  ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలోని నాలుగు ప్రధాన కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి జేఏసీ ఉమ్మడి ఎజెండా అంశాలను అందజేశారు. ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారని, తెలంగాణలో కూడా అదే తరహాలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.


ఆర్టీసీలో సమ్మె అనివార్యమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంఘాలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ వీలీనంపై పంజాబ్‌, హర్యానా వెళ్లి అధ్యయనం చేసి యాజమాన్యానికి నివేదిక ఇచ్చామంటున్నారు కార్మిక నేతలు. సంస్థ నష్టాల్లో ఉందని పదేపదే చెబుతున్నారనీ... అసలు ఇందుకు కారణం ప్రభుత్వమేనని కార్మిక నేతలు ఆరోపించారు. సంస్థకు వచ్చే ఆదాయంలో రోజుకు 40 శాతం పన్నుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. పన్నులను ప్రభుత్వం మినహాయించాలని కోరారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేయాలని నిర్ణయించారు.


గత నెలలో కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యంకు ఇచ్చిన సమ్మె నోటీసులపై లేబర్ కమిషనర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమస్యలు, యూనియన్ నేతల డిమాండ్ లపై ఈనెల 23న చర్చలకు రావాలని తెలంగాణ కార్మిక శాఖ అధికారుల నుంచి సమాచారం అందిందనీ... చర్చలకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు హాజరు అవుతారని స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: