మోడీ అంటేనే ఓ భయంతో కూడిన భక్తితో కలిగే గౌరవం అందరికీ ఉంటుంది. మోడీ పన్నెండేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసినా ఆరేళ్ళుగా ప్రధానిగా ఉన్నా కూడా ఆయన చూపుల్లో చురుకు మాటల్లో కటువు ప్రత్యర్ధులకు కలవరపెడుతూనే ఉంటాయి. ఇక మోడీ అంటేనే అన్నది చేసి తీరుతారని పేరు కూడా ఉంది. గిట్టని వారు మొండిఘటం అని కూడా అంటారు. ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకున్న వారంతా పై విధంగా భయపడిన వారే మరి. 


అయితే ఇపుడు మోడీ అధికారం కచ్చితంగా నాలుగు నెలలు మాత్రమే పూర్తి అయింది. అంటే ఇంకా 56 నెలల పవర్ మోడీ చేతుల్లో ఉంది. ఈ నేపధ్యంలో మోడీ సార్ పాలనాపరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా మోడీ ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోని సెక్షన్ ఉద్యోగుల మీద బిగ్ బాంబ్ వేయాలనుకుంటున్నారుట. అదేంటి అంటే తొందరగా వారికి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపించేయడానికి మోడీ సార్ రెడీ అంటున్నారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులు మోడీ తగ్గిస్తారని టాక్ నడుస్తోంది. దీనికి సమబంధించి తెర వెనక కసరత్తు కూడా సాగుతోందని దీనిపై వినిపిస్తున్న  మాట. ఆ సమాచారం ప్రకారం చూస్తే  ఉద్యోగుల రిటైర్మెంట్ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకోవడం లేదా ఉద్యోగికి 60 ఏళ్ల వయసు రావడం అనే అంశాల ప్రాతిపదికన రిటైర్మెంట్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 


ఇకపై ఐపీఎస్ ఐఏఎస్ పదవుల నుంచి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా రిటైర్మెంట్ వయసు అరవయ్యేళ్ళుగా నిర్ధారిస్తారు. అదే సమయంలో 33 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అరవైకి ముందే పదవి నుంచి దిగిపోవాల్సివుంటుంది. రిటైర్మెంట్ వయసు తగ్గింపు ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఏడవ వేతన సంఘం సిఫార్సులలోనూ ఈ అంశం ప్రస్తావన ఉందని కేంద్రం పేర్కొంటోంది. దీని వల్ల లక్షల్లో జీతాలు సీనియర్లకు చెల్లించే అతి పెద్ద బాధ్యత నుంచి కేంద్రం  తప్పుకుని ఆర్ధిక వెసులుబాటుని పొందుతుందన్నమాట.


వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదనను అమలు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోందట. అదే కనుక జరిగితే చాలా మంది కేంద్ర సర్వీసుల ఉద్యోగులు పిట్టల్లా రాలడం ఖాయమే. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం అధికంగా ఉందని, అందువల్ల ఈ ఖాళీలలో కొత్త వారికి అవకాశం ఇస్తారన్న మాట వినిపిస్తోంది. అయితే అది ఎంతవరకు అమలు అవుతుందన్నది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: