కేసీయార్ రాజకీయ దురంధరుడి అని అంతా ఒప్పుకునే నిజమే. తెలంగాణాలో బలమైన కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన ఘనుడు ఆయన. అంతేనా కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తూ హస్తానికి మైండ్ బ్లాంక్ అయ్యేలా కేసీయార్ యాక్షన్ ప్లాన్ అక్కడ అమల్లో  ఉంది. అదే సమయంలో తెలంగాణా గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు లేకుండా చేసిన ఘనతను కూడా కేసీయార్ దక్కించుకున్నారు. ఇక బీజేపీ మొగ్గ తొడగకముందే తుంచేయాలని పధక రచన చేస్తున్నారిపుడు. 


ఏపీలో చూసుకుంటే జగన్ పరిస్థితి అలా లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా బలంగానే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఓటమి పాలు అయినా కూడా సినీ హీరోగా ఆయనకు ఉన్న క్రేజ్ వల్ల ఆ పార్టీ జనాల్లో నానుతోంది. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు ఏపీలో ప్రభావం చూపాలనుకుంటున్నారు. మొత్తానికి చూస్తే మూడు వైపుల నుంచి జగన్ కి ముప్పు గట్టిగానే ఉంది.


ఇదే విషయం కేసీయార్ జగన్ ల మధ్యన నిన్న జరిగిన భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. శత్రుశేషం రుణ  శేషం అసలు ఉంచరాదన్నది కేసీయార్ నీతి. దాన్ని కచ్చితంగా అమల్లోకి పెట్టి తెలంగాణాలో తన రాజకీయ మనుగడను పూలపానుపు చేసుకున్న కేసీయార్ ఈ విష‌యంలో జగన్ కి కూడా సలహాలు ఇస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికి మొత్తం ప్రతిపక్షం లేకుండా చేయాలని కూడా కేసీయార్ జగన్ కి రాజకీయ ఎత్తుగడల గురించి సూచించారట. జగన్ గట్టిగానే వెళ్ళాలని, ప్రతిపక్షాన్ని ధీటుగానే ఎదుర్కోవాలని కేసీయార్ చెప్పారని టాక్. మొత్తానికి ఏపీలో జగన్ కూడా కేసీయార్ బాట పడతారా చూడాలి మరి. అదే జరిగితే ఏపీ పరిణామాలు వేగంగా మారుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: