రాజ‌కీయాల్లో ఎంతటి చిత్ర‌మైన ప‌రిస్థితులు ఉంటాయో తెలియాలంటే క‌ర్ణాట‌క‌లోని ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే చాలు అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఎత్తులు పై ఎత్తుల‌తో...సంకీర్ణ స‌ర్కారును కుప్పుకూల్చుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్ నేత‌లు ఇప్ప‌టికీ త‌మ మాట‌ల యుద్ధం కొన‌సాగిస్తున్నారు. తాజాగా, క‌ర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య, జేడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి మధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు సాగాయి. రాబోయే ఎన్నిక‌ల గురించి ఇద్ద‌రు నేత‌లు బ్లేమ్ గేమ్ ఆడారు.


కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటమికి రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేకపోవడమే కారణమని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. తాజాగా... ఇవాళ కుమారస్వామి మాట్లాడుతూ.. ``సిద్ధరామయ్య దయ వల్ల సీఎంను అయ్యానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నేను సిద్ధరామయ్య ఇంట్లో పెంచిన చిలుకను కాదు. నేను కాంగ్రెస్‌ అధిష్టానం దయవల్ల కర్ణాటకకు ముఖ్యమంత్రిని అయ్యాను. కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్లు విని ఉంటే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఉండేది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ప్రాంతీయంగా కొంత శక్తిని ఏర్పర్చుకున్నాను. ప్రాంతీయంగా శక్తిని ఏర్పర్చుకునే దమ్ము సిద్ధరామయ్యకు ఉందా?`` అని కుమారస్వామి ప్రశ్నించారు. సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచేవారు ఎవరూ లేరని కుమారస్వామి పేర్కొన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ వద్ద ఎంతో మంది కాలం వెల్లదీశారని ఆయ‌న ఎద్దేవా చేశారు.  


కాగా, గ‌తంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఇలాగే విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఓ వీడియోని బట్టి స్ప‌ష్ట‌మైంది. ఈ వీడియోలో మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో చెప్పలేమని ఆ వీడియోలో సిద్ధరామయ్య అన్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తితో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అసలు ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకునేది అనుమానమే అని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమవుతుందో చూద్దాం అని సిద్ధరామయ్య అనడం గమనార్హం. ఈ వీడియోను స్థానిక చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ వీడియో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: