పాత్రికేయుడు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడి వ్యవహారం చూస్తుంటే అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి విచిత్రంగా ఉంది. బాధితుడు ఒకడే కానీ పార్టీల పాత్రే చిత్రంగా మారిపోయింది. రెండు రోజలు క్రితం చీరాలలో పాత్రికేయుడు నాగార్జున రెడ్డి మీద దారుణంగా దాడి చేశారు. దాడిలో రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసింది మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణ మోహన్ దగ్గరి బంధువులు, మద్దతుదారులే అనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తోంది.

 

ఈ నేపధ్యంలోనే ఆమంచిపై తెలుగుదేశంపార్టీ రెచ్చిపోతోంది. నాగార్జునరెడ్డికి మద్దతుగా చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్లలో తెగ పోస్టులు పెట్టేయటం విచిత్రంగా ఉంది. పాత్రికేయుడి మీద దాడిపై చంద్రబాబు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బాగానే ఉంది కానీ ఇదే ఆమంచి సోదరుడు, మద్దతుదారులు ఇదే నాగార్జునరెడ్డి మీద గతంలో కూడా దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో పత్రికా స్వేచ్చ మీద, పాత్రికేయల రక్షణ గురించి చంద్రబాబు, చినబాబు ఎందుకు నోరిప్పలేదు ?

 

ఎందుకంటే ఆమంచి ఆరోజున టిడిపిలో ఎంఎల్ఏగా ఉన్నారు కాబట్టి పాత్రికేయునిపై జరిగిన దాడిని పట్టించుకోలేదు. సరే మరి అప్పటి ప్రతిపక్షం వైసిపి ఏం చేసింది ? ఏం చేసిందంటే పాత్రికేయునిపై దాడి చేయటాన్ని ఖండించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేసింది. స్ధానిక పోలీసులైతే అసలు దాడి గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

 

సీన్ కట్ చేస్తే అప్పటి పార్టీలకు అసెంబ్టీలో స్ధానాలు మారాయి. వైసిపి అధికారంలోకి వస్తే టిడిపి ప్రతిపక్షంలో కూర్చుంది. పార్టీల స్ధానాలు మారాయి కానీ తాజాగా అదే పాత్రికేయుడు నాగార్జునరెడ్డిని ఇపుడు ఇంకా దారుణంగా గాయపరిచారు. దెబ్బలు తిన్నది ఒకడే, దాడి చేసి గాయపరిచిందీ ఒకళ్ళే. ఇక్కడే పార్టీల వైఖరి విచిత్రంగా మారిపోయింది.

 

ప్రతిపక్షంలో ఉన్న టిడిపియేమో పాత్రికేయునిపై జరిగిన దాడిని ఎడాపెడా ఖండించేస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీయేమో దాడి విషయంపై అసలు నోరే విప్పటం లేదు. మరి దెబ్బలుతిన్న పాత్రికేయుడు నాగార్జునరెడ్డికి న్యాయం ఎప్పుడు జరగాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: