బెంగళూర్ టు ఇందూర్.. మత్తు పదార్థాల అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మత్తు కోసం కల్లులో కలిపే క్లోరో హైడ్రేట్  ఇందూర్ నుంచే మిగతా జిల్లాలకు సరఫరా అవుతోంది. ఇది గుర్తించిన ఉన్నతాధికారులు ఇందూర్ పైనే ప్రధానంగా నిఘా పెట్టారు.  పక్కా సమాచారంతో హైదరాబాద్  నుంచి ప్రత్యేకంగా వచ్చిన బృందం సభ్యులు మత్తుపదార్థాల అక్రమ దందా గుట్టును రట్టు చేశారు.


బెంగళూర్ నుంచి నిజామామాబాద్ కు మత్తు పదార్థాల సరఫరా యథేచ్చగా సాగిపోతోంది. నిజామాబాద్ శివారులోని మదావన్ నగర్ లో రెండు లారీల సరుకును నార్కోటిక్ బృందం పట్టుకుంది. రెండు లారీలలోని యాభై సంచుల్లో క్లోరో హైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సంచిలో పాతిక కేజీల చొప్పున మత్తు పదార్థాలు ఉన్నాయి. యాభై  సంచుల్లో మొత్తం 1250 కిలోల క్లోరో హైడ్రేట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్ లో సుమారు అరవై లక్షల వరకూ  ఉంటుందని అంచనా.

మరోవైపు...ఈ లారీల్లో కొన్ని సంచులు మాయమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసును ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. మత్తుపదార్థాలను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్ ను  పోలీసులు విచారించారు. కోళ్లఫారానికి సంబంధించిన దాణా బస్తాలను తీసుకువెళ్లడానికి కిరాయికి పిలిచారని చెప్పాడు. ఆర్యనగర్ ప్రాంతంలో  దాణా బస్తాలను తరలించాలని తనతో చెప్పినట్లు పోలీసులకు వివరించాడు. దీనిపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.


ఇక...మత్తు పదార్థాల అక్రమ రవాణా జిల్లా ఎక్సైజ్ అధికారులకు తెలిసే జరుగుతుందన్నవిమర్శలు ఉన్నాయి. ఇటీవల కామారెడ్డి హైవేపై కూడా మత్తు పదార్థాలను తరలిస్తున్న ఓ వ్యాన్ ను నార్కోటిక్ ప్రత్యేక బృందం దాడి చేసి పట్టుకుంది. ఈ  వ్యాన్ లో పెద్ద ఎత్తున క్లోరో హైడ్రేట్ మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూర్ నుంచి క్లోరో హైడ్రేట్ మత్తు పదార్థం ఇందూరుకు వస్తుంది. ఇక...ఇక్కడి నుంచే మిగతా చోట్లకు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. బెంగూళూర్ నుంచి మత్తుపదార్థాలు రాగానే వీటిని స్థానికంగా ఓ గోదాంలోకి డంప్ చేస్తారు. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి కల్లు దుకాణాలకు సరాఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో పెద్ద ఎత్తున క్లోరో హైడ్రేట్ లోడ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి మిగతా  చోట్లకు తరలించే క్రమంలో నార్కోటిక్ బృందం సభ్యులు క్లోరో హైడ్రేట్ లోడును పట్టుకున్నారు. మొత్తానికి...ఈ కేసులో ప్రధాన నిందితులు పట్టుపడితే తప్పా మత్తు పదార్థాలకు సంబంధించిన అసలు గుట్టు బయటికి  వచ్చే ఛాన్స్ లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: