కొంద‌రు రాజ‌కీయ నేత‌లుంటారు..స్వ‌ప‌క్షంలో విప‌క్షం అన్న‌ట్లుగా. అలాంటి వ్యక్తిగా బీజేపీనేత సుబ్రమణ్యం​ స్వామిని పేర్కొన‌వ‌చ్చు. ఈ ఫైర్‌బ్రాండ్ నేత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సరైన ఆర్థిక విధానాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్​ ఇన్ ఇండియా లాంటి గొప్ప కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. స్థూల ఆర్థిక పాలసీల విషయంలో సరైన విధానాలు పాటించలేదని అన్నారు. రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు సుబ్రమణియన్​. ఫిక్సెడ్ డిపాజిట్​, సేవింగ్స్ ఖాతాలు 9 శాతం వడ్డీని పొందేలా చూడాలన్నారు. ముంబయిలో జరిగిన విశ్వ హిందూ ఆర్థిక సదస్సు ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.


మ‌రోవైపు, అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాలెం విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ..భారత్‌దేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిందని  అన్నారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనకు విశిష్టత ఉందన్నారు. 2014లో మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎన్ వెళ్లా. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వెళ్లా. ఈ ఐదేళ్లలో చాలా పెద్ద మార్పును గమనించా. భారత్ పట్ల గౌరవం, భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హౌడీ-మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అన్నారు. ఈ కార్యక్రమం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసిందన్నారు.


కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి గాడిలో పడుతుందన్న విశ్వాసాన్ని డన్ అండ్ బ్రాడ్‌ స్ట్రీట్ ఎకానమీ వ్యక్తం చేసింది. వృద్ధిరేటు బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలు ఇందుకు దోహదం చేయనున్నాయన్న ఆశాభావాన్ని డీఅండ్‌బీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త అరుణ్ సింగ్ వెలిబుచ్చారు. రాబోయే నెలల్లో పారిశ్రామికోత్పత్తి క్రమేణా పెరుగుతుందని అంచనా వేసిన ఆయన ఈ పండుగ సీజన్ అమ్మకాలు బాగుంటే.. పరిస్థితులు చక్కబడ్డట్లేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా ఆర్థిక మందగమనం నిజమైనదన్న ఆయన.. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో దేశ జీడీపీ గణాంకాలు ఆరేండ్లకుపైగా కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికి దిగజారాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: