ఎయిర్‌ కండీషనర్‌, వాక్యూమ్‌ క్లీనర్‌,  గ్రైండర్‌, ల్యాప్‌టాప్ ఇవ‌న్నీ....ఆస‌క్తి ఉంటే...మీకు ఇచ్చేస్తార‌ట‌. నిజంగా వ‌స్తువుల రూపంలో కాదంటి. చిహ్నాల రూపంలో! ఏంటి బొమ్మ‌ల రూపంలో మాకెందుకు? ఇంత‌కీ ఇలా ఇచ్చేది ఎవ‌రు అనుకుంటున్నారా? కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఎందుకు ఇస్తుంది అంటారా? వచ్చే నెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్య్ర అభ్యర్థులకోసం ఈసీ 197 రకాల ఎన్నికల గుర్తులను కేటాయించనుంద‌న్న‌మాట‌. ఆ గుర్తుల్లోనివే పైన పేర్కొన్న అంశాలు.


ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్‌, కేటాయింపు) ఆర్డర్‌, 1968 ప్రకారం.. పోటీచేసే అభ్యర్థులకు చిహ్నాలను ఈసీ కేటాయిస్తుంది. రిజిస్టర్‌ అయిన పార్టీలు ఇప్పటికే రిజర్వు చేసిన చిహ్నాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 'చేతి' గుర్తును కాంగ్రెస్‌కు, కమలం గుర్తును బీజేపీకి ఈసీ రిజర్వ్‌ చేసింది. ఈ గుర్తులను ఇతర పార్టీలు ఉపయోగించలేవు. ఈసీ నుంచి ఒకే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలూ ఇతర రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన గుర్తులను ఉపయోగించుకోవడానికి రిజర్వ్‌ చేసుకోవచ్చు. ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటున్న స్వతంత్య్ర అభ్యర్థులు సుదీర్ఘమైన ఈ ఎన్నికల చిహ్నాల జాబితాలోంచి మూడు గుర్తులను ఎంపిక చేసుకుంటే, ఈసీ వాటిలోంచి ఓ గుర్తును కేటాయిస్తుంది. పార్టీ టికెట్‌ ద్వారా పోటీ చేసేవారు కాకుండా మిగతా ఎవరైనా ఈ గుర్తులను ఎంచుకోవచ్చు. 


ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి పాత వస్తువుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన గాడ్జెట్ల దాకా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు, ఒకప్పటి రుబ్బురోలు.. గ్రైండర్‌, ఎయిర్‌ కండీషనర్‌, వాక్యూమ్‌ క్లీనర్‌, ల్యాప్‌టాప్‌ వంటి గాడ్జెట్‌లతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. పలకడానికి సులభంగా ఉండే అగ్గిపెట్టె, మైక్‌ వంటి చిహ్నాలూ ఉన్నాయి. కూరగాయల నుంచి గాడ్జెట్‌ల దాకా, ఏసీ, ల్యాప్‌ట్యాప్‌, క్యాప్సికం.. ఇలా కాదేది ఎన్నికల గుర్తుకు అనర్హం అన్న రీతిలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆఫ‌ర్‌తో...ఎంద‌రు స్వ‌తంత్రుల అదృష్టం మారుతుందో వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: