మిగులు జలాలపై కర్నాటక కొత్త లొల్లిని షురువు చేసింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున తమ రాష్ట్రానికి కృష్ణా జలాలను కొత్తగా కేటాయించాలని ప్రభుత్వం 2014 జూలై 7న కేంద్ర జలవనరుల శాఖను కోరింది.ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించినందున,ఈ విషయాన్ని బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ వద్దే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌‌‌‌లో అప్పీల్‌‌‌‌ చేసినా ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌‌‌‌ 89కి ఉన్న పరిమితుల దృష్ట్యా కృష్ణా జలాల పునః పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య కాకుండా ఏపీ,తెలంగాణకే బోర్డు పరిమితం చేసింది.



ఐసీడబ్ల్యూఆర్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ -3 ప్రకారం కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో అర్థించింది. కృష్ణా నది క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా,తెలంగాణలో 19.9 శాతం ఉండగా 299 టీఎంసీలే కేటాయించారని, 9.2 శాతం క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారని రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.తెలంగాణకు న్యాయం చేయాలంటే నీటిని తిరిగి పంపిణీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తోంది.ఈ సందర్భంలో కృష్ణా మిగులు జలాలపై తెలంగాణకు హక్కుల్లేవంటూ ఎగువ రాష్ట్రం కర్నాటక కొత్త లొల్లి లేవనెత్తుతోంది.



కర్ణాటక,మహారాష్ట్రతోపాటు ఇప్పుడు  తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రమేనని, మిగులు జలాలు ఉపయోగించుకునే అధికారం లేదని అంటోంది. దిగువ రాష్ట్రంగా అన్ని రైట్స్​ ఏపీకే ఉన్నాయని చెబుతోంది. దీనిపై ఇటీవల కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది.ఇదే రీతిగా రేపోమాపో ఆంధ్రప్రదేశ్​ కూడా గొంతు కలిపితే మిగులు జలాలపై ఆధారపడిన రాష్ట్రంలోని ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశముందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం దోస్తీ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ కృష్ణాలో నీటి దోపిడీ ఆగడం లేదని, ఏపీ అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ నీటిని దారి మళ్లిస్తూన్నారని.అంతేకాకుండా ఇప్పుడు కర్నాటక వాదిస్తున్నట్టుగానే రేపు ఏపీ కూడా నికర జలాలు తప్ప మిగులు జలాల్లో తెలంగాణకు వాటా లేదంటే ఉమ్మడి పాలమూరు,రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఏమిటని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: