కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛను తీర్చడానికి ఏర్పాటవుతోంది ఆసియాలోనే అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జ్. పూర్తి విదేశీ టెక్నాలజీతో అత్యంత హంగులు జోడించి నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రే ఎప్పటికప్పుడు పనుల వివరాలపై ఆరా తీస్తున్నారు. దీంతో కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానుంది ఆ కేబుల్ బ్రిడ్జ్. 


కరీంనగరవరంగల్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఈ వంతెన పూర్తయితే.. నగర ప్రయాణం ఏడు కిలోమీటర్లు తగ్గుతుంది. అందుకోసం మానేరు వాగుపై 2017లో కేబుల్ వంతెన నిర్మాణాకి శంకుస్థాపన జరిగింది. రెండు పిల్లర్లలో ఒకదాని నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, మరో పిల్లర్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. టర్కీకి చెందిన గ్లూమార్క్ సంస్థతో కలిసి టాటా కన్సల్టెన్సీ వంతెన నిర్మాణ పనులు నిర్వహిస్తున్నాయి. 


500 మీటర్ల కేబుల్ వంతెన నిర్మాణంలో ప్రధానంగా రెండు ఫైలాన్లు నిర్మిస్తుండగా.. అందుకోసం పూర్తి స్థాయిలో విదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రెండు ఫైలాన్ల మధ్య 220 మీటర్లు ఉండగా.. ఫైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు 110 మీటర్ల చొప్పున, ఇంటర్ మీడియన్ నుంచి అంబుస్ మెట్స్‌కు 30 మీటర్ల చొప్పున దూరం ఉంటుంది. బ్రిడ్జికి ఉపయోగించే కేబుల్స్‌ను ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అంతేకాక బ్రిడ్జిపై నిర్మించే నాలుగు వరుసల రోడ్డుకు కూడా సెగ్మెంట్ల వారీగా పనులు చేపడుతున్నారు. మొత్తం 138 సెగ్మెంట్లు అవసరం ఉండగా.. ఇప్పటికి 30 సెగ్మెంట్లను పూర్తి చేశారు. దీంతో ఫిబ్రవరి నాటికి కరీంనగర్ ప్రజల కలల వంతెన అందుబాటులోకి రానుంది. 


మొత్తం మీద వెయ్యి టన్నుల కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ వంతెనపై బరువైన వాహనాలు కూడా సులువుగా వెళ్లేలా నిర్మాణం జరుగుతోంది. మన దేశంలో కేబుల్ బ్రిడ్జిలు రెండే ఉండగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది. దీంతో.. కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు కరీంనగర్ వాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: