ఎట్టకేలకు బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ 162 స్థానాల్లో , శివసేన 126 సీట్లకు పోటీ చేస్తుంది. 50-50 ఫార్ములా కోసం శివసేన పట్టుబట్టినా బీజేపీ తన పంతం నెగ్గించుకుంది. రెండు పార్టీలు మొదటి విడత జాబితాను విడుదల చేశాయి. అయితే కీలకమైన స్థానాలను బీజేపీకి కేటాయించడంపై శివసైనికులు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు.  


కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా...సీట్ల పంపకాలపై మాత్రం బీజేపీ-శివసేన మల్లగుల్లాలు పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి..ఆ తర్వాత ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ- శివసేన ఈ సారి మాత్రం ఎన్నికల ముందే పొత్తును ప్రకటించాయి. అయితే రెండు పార్టీలు ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి? ఎవరెవరికి ఏఏ స్థానాలు కేటాయించాలనే విషయంలో నిన్నటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో చివరకు రెండు పార్టీలు సీట్ల షేరింగ్ ఫార్ములాకు ఓకే చెప్పాయి. దీనికి సంబంధించి ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ 162 స్థానాల్లో... శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తుంది. 


కూటమిలోని ఇతర చిన్న పార్టీలకు బీజేపీ తన కోటా నుంచే సీట్ల కేటాయించనుంది. బీజేపీ, శివసేనతోపాటు ఆర్పీఐ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, శివసంగ్రామ్, రయత్ క్రాంతి పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే... చెరి సగం సీట్లకు పోటీ చేద్దామని శివసేన ప్రతిపాదించింది. అయితే అందుకు బీజేపీ సరేమిరా అంగీకరించలేదు. 50-50 ఫార్ములా సాధ్యపకడపోవడంతో శివసేన చివరి వరకు తమకు కావాల్సిన సీట్ల కోసం పట్టుపడుతూనే వచ్చింది. 


మరోవైపు రెండు పార్టీలు మొదటి అభ్యర్ధుల జాబితాను విడుదల చేశాయి. బీజేపీ 125 మందితో అభ్యర్ధులను ప్రకటించింది.  మొదటి జాబితాలో 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది బీజేపీ. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2014లో ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు. అటు శివసేన కూడా 70 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. ఆదిత్య థాకరే వర్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. తమకు పట్టున్న స్థానాలను బీజేపీకి కేటాయించడంపై కొన్ని నియోజకవర్గాల్లో శివసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: