సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయిన సమావేశం...రాత్రి 11.30 గంట‌ల‌కు ముగిసింది.ఇంత సుదీర్ఘంగా సాగిన స‌మావేశం ఏంటో తెలుసా?  తెలంగాణ కేబినెట్‌. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో  వివిధ అంశాలపై దాదాపు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంకోసం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన ఎనిమిది మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని తీర్మానించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని నిర్ణయించింది. 


ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో కేబినెట్ కార్మికుల‌కు కీల‌క ప్ర‌తిపాద‌న పెట్టింది. ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచ న విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తిచేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని సూచించింది. ఇందుకోసం ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారి డిమాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునిల్‌శర్మ సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. 


 డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉన్నదని స్పష్టంచేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని, కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని విజ్ఞప్తిచేసింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు దిగి, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరింది. కాగా, ప్ర‌భుత్వం నియ‌మించి ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చిస్తుంది. వారి డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని నిర్ణయించిన మంత్రిమండలి.. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో అంద‌రి చూపు క‌మిటీపై ప‌డింది.


కాగా, మంత్రిమండ‌లి స‌మావేశానికి కొన‌సాగింపుగా ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేయనున్నారు.  గ్రామాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుతీరుపై చర్చించడానికి ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీపీవోలను, డీఎల్పీవోలను కూడా ఆహ్వానించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కాపాడటానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలతోపాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: