భారత్‌లో సంపన్నుల జనాభా పెరుగుతోంది. వారితో పాటు విలాస వస్తువులు, ఖరీదైన ఉత్పత్తుల మార్కెట్ కూడా దూసుకుపోతున్నది. భారతీయ లగ్జరీ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2014 కల్లా వెయ్యి కోట్ల డాలర్లను (60 వేల కోట్ల రూపాయలు) దాటవచ్చ ని సిఐఐ-ఐఎంఆర్‌బి నివేదిక తెలిపింది. భారత్‌లో సంప్రదాయంగా ఉన్న సంపన్నులకు తోడుగా గత కొద్ది ఏళ్లలో ఆవిర్భవించిన నయా ధనిక వర్గం కొనుగోళ్లతో లగ్జరీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నెలకొని ఉన్న ఆర్థిక మందగమనం లగ్జరీ అమ్మకాలపై కొంత మేర ప్రభావం చూపుతున్నా, 2014 మధ్య నాటికి అమ్మకాలు తిరిగి ఊపందుకోవడంతో లగ్జరీ మార్కెట్ 17 శాతంమేర వృద్ధి నమోదు చే స్తుందని ఈ సర్వే తెలిపింది. 2007లో 366 కోట్ల డాలర్లున్న ఈ మార్కెట్ 2012 నాటికి రెట్టింపయి 758 డాలర్లకు చేరింది. వచ్చే దశాబ్ది కాలంలో లగ్జరీ ఉత్పత్తులకు భారత్ ప్రముఖ మార్కెట్‌గా ఎదుగుతుందని, అయితే ఈ క్రమంలో ధరలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లగ్జరీ వస్తువులు కుబేరుల కోసం ప్రత్యేకించినందున ఈ విభాగంలో బేరసారాలు అధిక వినియోగదారులను ఆకర్షించే తపన ఉండదు. ఉత్పత్తుల ప్రత్యేకత ధరతో ముడివడి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రపంచ లగ్జరీ ఉత్పత్తుల మార్కెట్ విలువ 31,800 కోట్ల డాలర్లు. దీనితో పోలిస్తే దేశీయ మార్కెట్ చిన్నదే. 120 కోట్ల జనాభాలో భాగ్యవంతుల సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో భారత్ అందరినీ ఆకర్షిస్తోంది. వచ్చే మూడేళ్లలో భారత లగ్జరీ ఉత్పత్తుల మార్కెట్ 16 శాతం పైనే వృద్ధి సాధిస్తుందని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుతం లగ్జరీ వస్తువులు కేవలం కుబేరులకు మాత్రమే పరిమితం కావని, బిలియనీర్ల నిర్వచనానికి సరిపోని ఒక నయా ధనిక వర్గం ప్రస్తుతం ఈ లగ్జరీ మార్కెట్లలో కొనుగోళ్లు అధికంగా జరుపుతోందని సర్వే పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: