సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్ మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన స్కాంలో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న డైరెక్టర్‌ డాక్టర్‌ దేవికారాణి పాత్ర‌పై మ‌రిన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే   దేవికారాణితోపాటు సహా ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.  దేవికారాణి స్థానంలో ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా కార్మికశాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే, 2017-18 లో డాక్టర్‌ దేవికారాణి  ఎంప్లాయిస్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈజెహెచ్‌ఎస్‌) డైరెక్టర్‌గా ఉన్న సమయంలో భారీ మొత్తంలో మందుల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు వెలుగు చూసింది. ఈ విభాగానికి డైరెక్టర్‌గా పని చేసినప్పుడు ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని దర్యాప్తు వ‌ర్గాల స‌మాచారం.


ఎంప్లాయిస్ మ‌రియు జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈజెహెచ్‌ఎస్‌) డైరెక్టర్‌గా ఉన్న స‌మ‌యంలో దేవికారాణి భారీ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా మందులను కొనుగోలు చేసినట్టుగా లెక్కలు చూపించి అందులో భారీ మొత్తంలో వాటాలు పంచుకున్నారని ఏసీబీ వర్గాలను బట్టి తెలుస్తోంది. ఈ విష యమై తాజాగా కొన్ని ఆధారాలు లభించడం, మరి కొంత లోతుగా విశ్లేషించగా.. ఈ కోణంలోనూ ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు మరిన్న వాస్తవాలు వెలుగులోకి తేవడానికి ఏసీబీకి చెందిన మరో టీమ్‌ను డీజీ పూర్ణచంద్రరావు రంగంలోకి దింపారు. రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తుండటంతో ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. దేవికారాణి, ఓమ్ని మెడీ ఎండీ శ్రీహరిబాబు, ఉద్యోగి నాగరాజు ఇండ్లలో జరిపిన సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా దాదాపు 70 వరకు డిస్పెన్సరీల్లో స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించనున్నట్టు సమాచారం.


ఇదిలాఉండ‌గా, ప్ర‌స్తుత స్కాంలో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేవికారాణితో పాటుగా  వరంగల్‌ ఏరియా జేడీ కే పద్మ, ఆర్‌ఎఫ్‌డీడీ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ వీ హర్షవర్ధన్‌, ఈఎస్‌ఐ శంషాబాద్‌ గ్రేడ్‌-2 ఫార్మాసిస్టు ఎం రాధిక, ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌లో ఏడీ (స్టోర్‌) కే వసంత ఇందిరను సస్పెండ్‌చేస్తూ ముఖ్య కార్యదర్శి శశాంక్‌గోయల్‌ ఉత్తర్వులు జారీచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: