మహారాష్ట్రలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. గోరెగావ్‌ సమీపంలోని ఆరేకాలనీలో కార్ల పార్కింగ్‌ కోసం షెడ్ నిర్మించేందుకు ముంబై మెట్రో నిర్ణయించింది. మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు పిటిషన్లు కొట్టేసింది. 


ముంబయి ఆరే కాలనీలో చెట్ల నరికివేతను నిరసిస్తూ సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మెట్రో రైలు కారు షెడ్‌ భవనాల నిర్మాణం కోసం చెట్ల నరికివేతను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ముంబయి హైకోర్టు కొట్టివేసింది. దీంతో అర్థరాత్రి మెట్రో సిబ్బంది చెట్లను నరికివేసేందుకు ప్రయత్నించారు. దాదాపు 200 చెట్లను కూల్చిన తర్వాత భారీ ఎత్తున స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది వెనక్కి తగ్గారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.  


చెట్ల నరికివేతను తప్పుబట్టింది  శివసేన. చెట్లను కూల్చడానికి బదులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలను కూల్చాలంటూ యువనేత ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వాతావరణ మార్పులపై ఐక్య రాజ్య సమితిలో భారత్‌ వినిపించిన గళానికి ముంబయి మెట్రో చేస్తున్న పనులు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఓ వైపు పర్యావరణాన్ని ముంబయి మెట్రో ధ్వంసం చేస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధం, పర్యావరణ పరిరక్షణపై మాట్లాడడం అర్థ రహితమన్నారు. సుమారు 2,700 చెట్లను నరికివేయనున్నట్టు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించగా.. సుమారు 1287 హెక్టార్ల మేర విస్తరించి ఉన్న ఆరే కాలనీ ముంబయి మహా నగరానికి ఊపిరితిత్తుల లాంటిదని పలువురు సామాజిక కార్యకర్తలు వాదిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: