సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ప్రథమార్ధంలో నటించిన అజ్ఞాతవాసి మూవీ తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి, అంతకముందు తాను నెలకొల్పిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమవడం జరిగింది. ఇక గత ఎన్నికల సమయంలో టిడిపి పార్టీకి మద్దతిచ్చిన జనసేన పార్టీ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగి బరిలో నిలిచింది. అయితే ఆ పార్టీకి కేవలం ఒకే ఒక్క ఎమ్యెల్యే సీటు లభించడం జరిగింది. ఇక అధినేత పవన్ కళ్యాణ్, తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు. 

ఇక అప్పటినుండి పార్టీ కార్యాలపాలపై అలానే పార్టీ బలోపేతం పై మరింత దృష్టి పెట్టిన పవన్, ఇక పై ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాటం చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అంతేకాక జనసేనను ప్రజలకు మరింత చేరువ చేసి, రాబోయే ఎన్నికల సమయానికి మరింత బలమైన పార్టీగా తయారు చేసే విధంగా ముందుకు నడుస్తున్నారు. అయితే ఇటీవల కొందరు ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడడం వారికి కొంత మేర ఇబ్బందులు కలుగచేస్తోంది అనే చెప్పాలి. రావెల కిశోర్ బాబు, చింతల పార్ధసారధి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు తదితరులు ఇప్పటికే జనసేనకు రాజీనామా చేయగా, 

నిన్న మరొక సీనియర్ లీడర్ ఆ పార్టీని వీడారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆ నియోజకవర్గ మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ నిన్న షాకింగ్ గా ప్రకటించడం జరిగింది. అంతేకాక తనతో పాటు తన భార్య కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలపడం జరిగింది. ఇప్పటికే పలువురు పెద్ద నాయకులు పార్టీని వీడడంతో పార్టీ రాబోయే కాలంలో ఎంతవరకు సమర్ధవంతంగా ముందుకు నడుస్తుంది అనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో కొంత సందిగ్ధత నెలకొంది. మరి మున్ముందు జనసేనాని పవన్, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: