ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణం కట్టిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా కోసం సొంతూళ్లకు వెళ్లాలని ఎగబడుతున్న జనం జేబులకు ప్రైవేట్ ట్రావెల్స్ చిల్లులు పెడుతున్నాయి. పండగ రద్దీకారణంగా ఇటు రైళ్లు కిక్కిరిసిపోవడంతో అగచాట్లు అన్నీ ఇన్నీకావు.  


అసలే పండగ సీజన్  పైపెచ్చు ఆర్టీసీ కార్మికుల సమ్మె వెరసి తెలంగాణలో నరకప్రాయం తయారైంది ప్రజల దుస్థితి. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులు నడుతుపున్నా.. ప్రజల అవసరాలకు ఏమూలన సరిపోవడం లేదు. సందట్లో సడేమియా అన్నట్లు ఆర్టీసీ సమ్మెను క్యాష్‌ చేసుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. ప్రయాణీకుల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. ఆరంఘర్‌ నుంచి కర్నూలుకు 400 రూపాయలు, మహబుబ్‌నగర్‌కు 250 రూపాయలు, కొత్తకోట, కొల్లాపూర్‌, వనపర్తి రూట్ లలో పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్నారు.   


గత్యంతరం లేని పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులంతా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. లోపలికి అడుగుబెడితే చాలు అన్న భావనలో ఉన్నారంతా. ఒకరినొకరు తోసుకుంటూ రైలు ఎక్కుతున్నారు. జనరల్‌ బోగీల్లో కాలు తీసి కాలు  పెడుదామన్నా... స్థలం లేదు. నిలబడే ప్రయాణం చేస్తున్నారు.  
అసలే దసరా పెద్ద పండగ..తమవాళ్లతో ఆనందంగా గడుపుదామన్న ప్రజల ఆశలపై ఆర్టీసీ సమ్మె నీళ్లు చల్లింది. ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాల్సిందేనని పట్టుదలగా ఉన్నోళ్లు తంటాలు పడి వెళ్తుంటే, మరికొందరు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఆర్టీసీ స్ట్రైయిక్ కాలాఫ్ అయితే ఊళ్లకు పోవాలని ఆశపడుతున్నారు. ఓ వైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బెట్టు వీడటం లేదు. పైగా డిపోల ముందు బతుకమ్మలు ఆడుతూ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు మాత్రం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆర్టీసీ ప్రతినిధులతో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. మరి ఏమైవుతుందో వేచి చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: