ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న జనసేనకు ఆ పార్టీ నేతలు ఝలక్ ఇస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేయడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు పవన్ కల్యాణ్ తాను సీరియస్ పొలిటీషియన్ గానే ఉన్నానని సంకేతాలు పంపుతున్నా.. నేతలకు నమ్మకం రావడం లేదా అనే అనుమానం కలుగుతోంది. 


సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రావెల కిశోర్ బాబు, చింతల  పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌ ఇప్పటికే పార్టీని వీడారు. తాజాగా ఆ జాబితాలో ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య కూడా  చేరిపోయారు. జ‌న‌సేన పార్టీకి గాజువాక మాజీ ఎమ్మెల్యే చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పంపారు. కాగా ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెందుర్తి నుంచి జ‌న‌సేన త‌ర‌పున పోటీచేసి చింత‌ల‌పూడి ఓడిపోయారు.  గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి కూడా రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల.. గత ఎన్నికల్లో జనసేన నుంచి పార్లమెంట్ కు పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ఊహగానాలు వినిపించాయి. ఆకులతో పాటు ఆయన భార్య కూడా రాజీనామా చేయడంతో.. వారు ఏ పార్టీలో చేరతారనే విషయంపై చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: