దసరా పండుగ తెలంగాణ వాసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. సరిగ్గా పండుగ టైమ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో.. ప్రయాణీకులు అవస్థ పడుతున్నారు. ఓ వైపు బస్సుల్లేక, మరోవైపు రైళ్లలో ఖాళీల్లేక.. సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడల్లా.. చిన్నసైజు యుద్ధమే జరుగుతోంది. అటు హైదరాబాదీలు మెట్రోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. 


తెలంగాణలో దసరా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో.. జనానికి కష్టాలు తప్పడం లేదు. ఒక్కసారిగా రైళ్లలో రద్దీ పెరిగిపోవడం, అదనపు రైళ్లు నడపకపోవడంతో.. రైల్వే స్టేషన్ లలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ట్రైన్ వచ్చినప్పుడల్లా సీటు కోసం సిగపట్లు పడుతున్నారు. చివరకు పోలీసులు దగ్గరుండి ప్రయాణీకుల్ని అదుపుచేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 


మొన్నటివరకూ ట్రైన్ లో సీటు కోసం చూసినవాళ్లు.. ఇప్పుడు నిలబడటానికి చోటు ఉంటే చాలనుకుంటున్నారు. మహిళలు కూడా ట్రైన్ డోర్ లో నుంచి ఎక్కడం కుదరక.. కిటికీల్లో నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారులతో సొంతూళ్లకు పయనమైన వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్నిచోట్ల పోలీసులే చిన్నారుల్ని ఎత్తుకుని.. రైలు ఎక్కించాల్సి వస్తోంది. జనరల్ బోగీలు తక్కువగా ఉండటంతో.. ప్రయాణీకులకు కష్టాలు తప్పడం లేదు. రద్దీ భారీగా పెరిగినా.. అదనపు రైళ్లు వేయలేదని, కనీసం జనరల్ బోగీలు కూడా పెంచలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జనరల్ బోగీల్లో కాలు పెట్టడానికి కూడా చోటు లేక.. చివరకు లగేజీ పెట్టెలలో కూడా ప్రయాణిస్తున్నారు. మధ్యలో ఎక్కడైనా లగేజీ ఎక్కించాల్సి వస్తే.. ఈ బోగీలో ప్రయాణించేవాళ్లను దించేస్తారని తెలిసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో లగేజీ పెట్టెల్లో ఎక్కుతున్నారు ప్రయాణీకులు. దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికే కాదు.. హైదరాబాద్ లో ప్రయాణించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. మెట్రో రైళ్లలో కూడా ప్రయాణీకులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. నిన్న ఒక్కరోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారంటే.. రష్ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: